వీళ్లు దేశముదుర్లు.. గోల్డ్కు వెండి పూత పూసి తీసుకొస్తూ దొరికిపోయారు

వీళ్లు దేశముదుర్లు.. గోల్డ్కు వెండి పూత పూసి తీసుకొస్తూ దొరికిపోయారు

ఢిల్లీ : పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు పెద్దలు. అక్రమంగా డబ్బు సంపాదించేందుకు కొంతమంది ఎన్ని అడ్డదారులైన తొక్కుతున్నారు. సొసైటీలో లగ్జరీగా బతికేందుకు.. రాత్రికి రాత్రికే కోటీశ్వరులు కావాలని కలలు కంటూ ఎంతవరకైనా తెగిస్తున్నారు. చివరకు పాపం పండి.. ఏదో ఒక రోజు దొరికిపోక తప్పదు. విదేశాల నుంచి భారత్ కు వచ్చే వారిని ఎయిర్ పోర్టులలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న విషయాన్ని మర్చి.. అక్రమంగా గోల్డ్ తీసుకొస్తూ నిత్యం ఏదో ఒక ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిపోతున్నారు కొందరు స్మగ్లర్లు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ విమానాశ్రయం)లో ఇలాంటి ఘటనే ఒకటి బయటపడింది. కస్టమ్స్ అధికారుల కళ్లు బైర్లు కమ్మే ఇన్సిడెంట్ ఒకటి బయటపడింది. 

ఎలా దొరికిపోయారు..? 

కువైట్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు రూ.2.06 కోట్ల విలువైన 4 కిలోల వెండి పూతతో కూడిన బంగారు ఆభరణాలను ఇండియాకు తీసుకొస్తూ.. ఐజీఐ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. మహ్మద్ అఖిల్, మహ్మద్ యూసుఫ్, మహ్మద్ వసీమ్ అనే ముగ్గురు ఆగస్ట్ 28వ తేదీన కువైట్ ఎయిర్‌వేస్ విమానంలో IGI విమానాశ్రయానికి చేరుకున్నారు. వెంట తెచ్చకున్న గోల్డ్ ను చూపించకుండా ఎయిర్‌పోర్టు నుంచి మెల్లగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ.. గ్రీన్ ఛానల్ వద్ద కస్టమ్స్ అధికారులకు దొరికిపోయారు. 

ముగ్గురు నిందితులు బంగారు ఆభరణాలకు వెండితో పలుచని పొరను పూసి..ఇండియాకు తీసుకొచ్చారు. పట్టుబడ్డ ఆభరణాలలో అసలు బంగారం 80 శాతం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ముగ్గురిని అరెస్టు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు వారిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

భారతదేశంలోకి దిగుమతి అయ్యే బంగారంపై కస్టమ్స్ సుంకం 25శాతంగా ఉంది. ముగ్గురి నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలపై మొత్తం కస్టమ్స్ సుంకం రూ. 20 లక్షల 60 వేలు. వెండి పూత పూసిన బంగారు ఆభరణాలు భారత్‌లోకి తీసుకువస్తే.. ఇక్కడి కస్టమ్స్ అధికారులు పసిగట్టలేరని స్మగ్లర్లు ఎత్తుగడ వేశారు. కానీ.. కస్టమ్స్ అధికారుల అప్రమత్తతతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. పైగా కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. భారత్‌లోకి వస్తువులను అక్రమంగా తరలించే ప్రయత్నాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని ఈ ఉదంతం గుర్తు చేస్తోంది.