
ఆదిలాబాద్,వెలుగు: రైతును బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు రిపోర్టర్లను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఇచ్చోడ సీఐ బండారి రాజు సోమవారం తెలిపిన ప్రకారం.. నేరడిగొండ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన రైతు టగరేకాసాన్ దాస్ తన కూతురు పెండ్లి కారణంగా జొన్న పంటను గ్రామంలోని స్కూల్ ఆవరణలో డంప్ చేశాడు. ఇది తెలిసిన నేరడిగొండకు చెందిన ముగ్గురు రిపోర్టర్లు గాజుల దేవేందర్, గాజుల శ్రీకాంత్, షేక్ ఫసియుద్దీన్ గత మే నెల18న వెళ్లి టగరేకాసాన్ దాస్ ను బెదిరించారు.
స్కూల్ లో పంట డంప్ చేసినందుకు పోలీసులకు చెప్పి కేసు నమోదు చేయిస్తామని, లేదంటే రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిన రైతు రూ. 30 వేలు ఇచ్చాడు. బాధితుడు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపామని సీఐ తెలిపారు. నిందితుల వద్ద రూ. 1800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.