
- పంజాబ్‌లో ఇంకా తెరుచుకోని స్కూళ్లు, కాలేజీలు
శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తాయిబా(ఎల్‌ఈటీ) కమాండర్ షాహిద్ కుట్టాయ్‌తో సహా ముగ్గురు టెర్రరిస్టులు హతమమయ్యారు. సౌత్ కాశ్మీర్‌లోని షుక్రూ కెల్లర్ ఏరియాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కా సమాచారం ఆధారంగా..మన భద్రతా బలగాలు అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ సోదాలు జరుపుతుండగా వారిపై టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
వెంటనే అలర్టయిన బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయారు. మృతిచెందిన టెర్రరిస్టులు లష్కరే తాయిబాకు చెందినవారని అధికారులు వెల్లడించారు. మృతులను ఎల్‌ఈటీ కమాండర్ షాహిద్ కుట్టాయ్, ఆద్నాన్ షఫీగా గుర్తించామని, మూడవ వ్యక్తి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. షాహిద్ కుట్టాయ్.. షోపియాన్‌లోని చోటిపోరా హీర్‌పోరా ప్రాంతానికి చెందినవాడని చెప్పారు.
మార్చి 2023లో ఉగ్రవాద బృందంలో చేరాడని, ప్రస్తుతం "ఎ" కేటగిరీ టెర్రరిస్ట్ ఉగ్రవాదిగా.. సంస్థ ఉన్నత కమాండర్‌గా ఉన్నాడని వివరించారు. మే 18, 2024న హీర్‌పోరాలో బీజేపీ సర్పంచ్‌ను హత్య చేయడంలో అతని ప్రమేయం ఉంది తెలిపారు. పహల్గాం దాడి తర్వాత అధికారులు కుట్టాయ్ ఇంటిని కూడా కూల్చివేశారని వెల్లడించారు. ఆద్నాన్ షఫీ కూడా షోపియాన్‌లోని వాండునా మెల్హోరా ప్రాంతానికి చెందినవాడని.. అక్టోబర్ 2024లో ఉగ్రవాద బృందంలో చేరాడని చెప్పారు. ప్రస్తుతం అతను "సీ" కేటగిరీ టెర్రరిస్టుగా పనిచేస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు.
పంజాబ్‌లో ఇంకా తెరుచుకోని విద్యాలయాలు
పాకిస్తాన్‌తో సీజ్ఫైర్ ఒప్పందం జరిగినప్పటికీ పంజాబ్‌లోని 5 సరిహద్దు జిల్లాల్లో ఇంకా విద్యాలయాలు రీఓపెన్ కాలేదు. అమృత్‌సర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, ఫిరోజ్‌పూర్, తరన్ తారన్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు మంగళవారం కూడా తెరుచుకోలేదు. గురుదాస్‌పూర్‌తో పాటు సంగ్రూర్, బర్నాలాలోని పలు స్కూల్స్ మాత్రం రీఓపెన్ చేశారు. సోమవారం సాయంత్రం పాక్ వైపు నుంచి డ్రోన్స్ రావడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అమృత్‌సర్, హోషియార్‌పూర్‌లోని దసూయా, ముకేరియన్ ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ అమలు చేస్తున్నారు.