
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్‌లో ఈ రోజు జరిగిన ఘటన దృష్ట్యా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలి ఛైర్మన్, ప్రొటెం స్పీకర్, పోలీసు అధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి పంపించాలని ఆయన అధికారులకు తెలిపారు. ఇప్పటికే జారీ చేసిన పాసులు తప్ప అన్నింటినీ నిలిపి వేయాలన్నారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 15వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16న శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.
స్పీకర్ గా ఏకగ్రీవం
తెలంగాణ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు ముగియగా ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రేపు సభలో ప్రసాద్ కుమార్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించనున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.