
హైదరాబాద్, వెలుగు: డెయిరీ ప్రొడక్టులు అమ్మే హెరిటేజ్ ఫుడ్స్, 2026 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (ఏప్రిల్–-జూన్) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్వార్టర్లో సంస్థ తన చరిత్రలోనే అత్యధిక రాబడిని సాధించింది. ఈ మూడు నెలల కాలంలో మొత్తం రాబడి రూ. 1,136.8 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ. 1,032.67 కోట్లతో పోలిస్తే ఇది 10శాతం ఎక్కువ. ఖర్చులు అధికంగా ఉండటంతో కన్సాలిడేటెడ్ నికర లాభం 30.60శాతం తగ్గి రూ. 40.54 కోట్లుగా నమోదైంది.
గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 58.42 కోట్లు ఉంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, తొలి క్వార్టర్లో 10శాతం రాబడి వృద్ధిని సాధించామని, సంస్థ చరిత్రలోనే అత్యధిక క్వార్టర్లీ ఆదాయం రావడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఏప్రిల్, -మే నెలల్లో అకాల వర్షాలు విలువ ఆధారిత ఉత్పత్తుల అమ్మకాలపై తాత్కాలికంగా ప్రభావం చూపినప్పటికీ, జూన్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయని ఆమె పేర్కొన్నారు. రాబోయే క్వార్టర్లలో వృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఐస్‌క్రీమ్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని బ్రాహ్మణి చెప్పారు.