48 మంది టూరిస్టులు  19 గంటలు గాల్లోనే

48 మంది టూరిస్టులు  19 గంటలు గాల్లోనే
  • ప్రమాదంలో ఇద్దరు, కాపాడుతుంటే ఇంకొకరు మృతి
  • జార్ఖండ్​లోని త్రికూట పర్వతాలపై ప్రమాదం

రాంచీ: అది జార్ఖండ్​లోని త్రికూట పర్వతాలపై ఉన్న రోప్​వే.. బాగా పేరున్న టూరిస్టు ప్లేస్​ కావడంతో ఆదివారం జనం పోటెత్తారు. శ్రీరామ నవమి కూడా కావడంతో ఆ కొండల్లోని బాబా బైద్యనాథ్​ గుడికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. కొండల మధ్య ఉన్న లోయను దాటడానికి కేబుల్​ కార్​లోకి ఎక్కారు. రోప్​వేకు బిగించిన 25 కేబుల్​ కార్లలో ఓ కార్​ కంట్రోల్​ తప్పి మరోదాన్ని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు టూరిస్టులు చనిపోగా చాలా మందికి దెబ్బలు తగిలినయ్.  ఈ ప్రమాదం తర్వాత కేబుల్​ కార్లన్నీ ఎక్కడ ఉన్నయి అక్కడ్నే ఆగిపోయినయ్. 12 కేబుల్​ కార్లలో 48 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. సోమవారం సాయంత్రం దాకా 19 గంటల పాటు భయంభయంగా గడిపారు. వారిని కాపాడడానికి వచ్చిన ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది డ్రోన్లతో ఆహారాన్ని పంపించారు. చివరకు ఎయిర్​ఫోర్స్ టీమ్ స్పెషల్​ హెలికాప్టర్​ ద్వారా బాధితులను బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఓ టూరిస్టు హెలికాప్టర్​ నుంచి కిందపడి చనిపోయాడు. దీంతో చనిపోయిన వాళ్ల సంఖ్య మూడుకు పెరిగింది. ఈ ప్రమాదంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విచారం వ్యక్తంచేశారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందని తేల్చేందుకు దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

అసలేం జరిగింది..

శ్రీరామ నవమి కావడంతో ఆదివారం త్రికూట పర్వతాల్లోని బాబా బైద్యనాథ్​గుడికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రముఖ టూరిస్టు ప్లేస్​ కావడంతో సరదాగా గడిపేందుకు మరికొందరు వచ్చారు. గుడికి వెళ్లాలంటే రెండు కొండల మధ్య ఉన్న రోప్​ వే ఎక్కాల్సిందే. దాదాపు 25 కేబుల్​ కార్లు అటూఇటూ తిరుగుతుంటాయి. ఆదివారం సాయంత్రం దాదాపు 5 గంటల ప్రాంతంలో కిందికి వెళుతున్న ఓ కేబుల్​ కారు, పైకి వస్తున్న మరో కేబుల్​ కారును వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆ కేబుల్​ కార్లలోని ఇద్దరు టూరిస్టులు చనిపోయారు. ఈ ప్రమాదంతో కేబుల్​ కార్లన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయినయ్. రోప్​ వే మధ్యలో 12 కేబుల్​ కార్లు ఆగిపోగా.. అందులో పిల్లాపాపలతో కలిపి 48 మంది చిక్కుకుపోయారు. వాళ్లను కాపాడేందుకు ఎన్డీఆర్​ఎఫ్, ఐటీబీపీ​ సిబ్బంది రంగంలోకి దిగారు. రోప్​ వే మరమ్మతు చేయడానికి, కేబుల్​కార్లలో చిక్కుకున్నోళ్లను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. చీకటి కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం కలిగింది. సోమవారం మధ్యాహ్నానికి ఎయిర్​ఫోర్స్ రెస్క్యూ టీమ్​ త్రికూట హిల్స్ కు చేరుకుంది. దాదాపు 19 గంటల తర్వాత హెలికాప్టర్​తో బాధితులను క్షేమంగా తీసుకురావడం మొదలెట్టిన్రు. ఈ క్రమంలో ఓ టూరిస్టు హెలికాప్టర్​లోకి ఎక్కుతుండగా చేయిజారి కింద లోయలో పడ్డాడు. మిగతా వారిని కాపాడినట్లు అధికారులు తెలిపారు.

రెస్క్యూ లో ట్రాజెడీ..

కేబుల్​ కార్లలో చిక్కుకున్నోళ్లను కాపాడేందు కు చేపట్టిన రెస్క్యూ పనుల్లో విషాదం నెల కొంది. ఎయిర్​ఫోర్స్ సిబ్బంది హెలికాప్టర్​తో సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను కేబుల్​ కార్లలో నుంచి హెలికాప్టర్​లోకి చేర్చి, తర్వాత కిందకు తెచ్చారు. రోప్​వే పైన హెలికాప్టర్​ను నిలిపి, ఓ తాడును కేబుల్​ కార్​లోకి వదిలారు. దీంతో ఒక్కొక్కరుగా పైకి వచ్చారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాత్రం బాగా టెన్షన్​ పడ్డడు. హెలికాప్టర్​ లోపలికి వెళ్లే క్రమంలో చెయ్యి జారింది. దీంతో కింద లోయలో పడి చనిపోయాడు. కింద ఉన్న జనంలో కొంతమంది ఈ ప్రమాదాన్ని రికార్డు చేసి సోషల్​ మీడియాలో పెట్టారు.