శ్రామిక రైల్లో విషాదం: సొంతూరు చేరకుండానే ముగ్గురు వలస కూలీల‌ మృతి

శ్రామిక రైల్లో విషాదం: సొంతూరు చేరకుండానే ముగ్గురు వలస కూలీల‌ మృతి

దాదాపు నెల‌న్న‌ర రోజుల నిరీక్ష‌ణలో అల‌సిపోయిన వ‌ల‌స జీవులు.. కొన్ని గంట‌ల్లోనే సొంతూరు చేరుతామ‌న్న ఆనందంలో ఉన్న స‌మ‌యంలో శ్రామిక రైలులో ప్ర‌యాణిస్తుండ‌గా ముగ్గురు ప్రాణాలు విడిచారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న వ‌ల‌స కార్మికులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని త‌మ సొంతూళ్ల‌కు వెళ్తుండ‌గా.. మూడు వేర్వేరు ట్రైన్ల‌లో ఈ విషాద ఘ‌ట‌న‌లు జ‌రిగాయి.

యూపీలోని సీతాపూర్ కు చెందిన 29 ఏళ్ల క‌న్న‌య్య లాల్.. గుజ‌రాత్ లో వ‌ల‌స కూలీగా ప‌ని చేసేవాడు. క‌రోనా లాక్ డౌన్ తో అక్క‌డే చిక్కుకుపోయిన అత‌డు గుజ‌రాత్ లోని భావ‌న‌గ‌ర్ నుంచి యూపీలోని బ‌స్తీకి బ‌య‌లుదేరిన శ్రామిక్ స్పెష‌ల్ ట్రైన్ ఎక్కాడు. రైలు ల‌క్నోకు స‌మీపంలో ఉండ‌గా స‌డ‌న్ గా ఉన్న‌ట్టుండి త‌న సీటులోనే కుప్ప‌కూలిపోయాడు. ఏమైదోనన్న భ‌యంతో అత‌డికి సాయం చేసేందుకు తోటి ప్ర‌యాణికులు ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గా.. ఉలుకూప‌లుకూ లేదు. దీంతో వారు రైల్వే ఆధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. ట్రైన్ ల‌క్నో చేర‌గానే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే మ‌ర‌ణించాడ‌ని వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న శ‌నివారం రోజు జ‌రిగింద‌ని, క‌న్న‌య్య లాల్ మృత‌దేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించి సీతాపూర్ లోని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించామ‌ని తెలిపారు రైల్వే ఎస్పీ సౌమిత్రి యాద‌వ్. మ‌రో ఘ‌ట‌న‌లో గుజ‌రాత్ లోని ఢోలా నుంచి యూపీలోని ల‌క్నో మ‌ధ్య వేసిన శ్రామిక్ రైలులో 34 ఏళ్ల హీరాలాల్ బింద్ అనే వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారాయ‌న‌. ట్రైన్ ల‌క్నో చేరిన త‌ర్వాత వ‌ల‌స కార్మికులంతా దిగేశాక‌ అన్ని బోగీల‌ను చెక్ చేస్తుండ‌గా.. అత‌డి హీరాలాల్ స్పృహ లేకుండా ప‌డి ఉండ‌డాన్ని గుర్తించామ‌న్నారు.
దీంతో వెంట‌నే అత‌డిని బ‌ల‌రాంపూర్ హాస్పిట‌ల్ కు త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు చెప్పార‌న్నారు. దీని గురించి అత‌డి కుటుంబ‌స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చామ‌ని సౌమిత్రి యాదవ్ తెలిపారు. ఈ రెండు ఘ‌ట‌న‌లు త‌మ దృష్టికి వ‌చ్చాయ‌ని, బాధితుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం నుంచి సాయం అందిస్తామని చెప్పారు హోం శాఖ అడిష‌న‌ల్ చీఫ్ సెక్రెట‌రీ అవినాశ్ అవ‌స్తి తెలిపారు.

పుణె నుంచి ప్ర‌యాగ్ రాజ్ వెళ్తుండ‌గా

లాక్ డౌన్ కారణంగా పనిలేక సొంతూరు వెళ్తున్న 34 ఏళ్ల అఖిలేష్ కుమార్ అనే మైగ్రెంట్ లేబర్ శ్రామిక్ రైల్లో ప్రయాణం చేస్తుండగా మరణించాడు. పుణె నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తుండగా ప్రయాణంలోనే ఆయన చనిపోయినట్లు ఆర్పీఎఫ్ డీజీ అరుణ్ కుమార్ తెలిపారు. మధ్య ప్రదేశ్ లోని సతనా జిల్లాలోని మజ్గావన్ వద్ద రైల్లో అఖిలేష్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. యూపీ లోని గొండా ప్రాంతానికి చెందిన అఖిలేష్ కుమార్ పుణెలోని ఓ హోటల్ లో పనిచేస్తుండే వారు. లాక్ డౌన్ కారణంగా పనిలేకపోవటంతో శ్రామిక్ రైల్లో సొంతూరుకు ప్రయాణమయ్యాడు. ఇంటికి చేరకుండా రైల్లో అత‌డు మృతి చెందటం విషాదం నింపింది. మధ్య ప్రదేశ్ లోనే అతని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అఖిలేష్ కుమార్ కు కరోనా సోకిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అఖిలేష్ కు కరోనా ఉన్నట్లు నిర్ధారణ కాలేదని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.