
- ఢిల్లీలో ఘటన.. ముగ్గురు స్టూడెంట్లు మృతి
- ఒక్కసారిగా సెల్లార్లోకి ముంచెత్తిన వర్షపు నీరు
- లైబ్రరీలో చదువుకుంటున్న టైమ్‌లోనే ప్రమాదం
- 15 మందిని రెస్క్యూ చేసి కాపాడిన అధికారులు
- సెంటర్ నిర్వాహకులు అరెస్ట్
- మృతుల్లో శ్రీరాంపూర్ సింగరేణి మేనేజర్ బిడ్డ
- వ్యవస్థ వైఫల్యమే కారణం: రాహుల్ గాంధీ
- ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
- బాధితులకు హెల్ప్ చేయాలని రెసిడెంట్ కమిషనర్‌కు ఆదేశం
న్యూఢిల్లీ/కోల్‌బెల్ట్ (నస్పూర్), వెలుగు:ఢిల్లీలో ఘోరం జరిగింది. రాజేంద్రనగర్ లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు స్టూడెంట్లు చనిపోయారు. శనివారం సాయంత్రం ఓల్డ్ రాజేంద్రనగర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో వరద నీళ్లంతా సెల్లార్లోకి వెళ్లాయి. వరద ఉధృతికి లైబ్రరీ తలుపులు పగిలిపోయాయి. ఆ టైమ్‌లో సుమారు 18 మంది స్టూడెంట్లు లోపలే ఉన్నారు. ఈ ఘటనలో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా మేనేజర్ విజయకుమార్ కూతురు తానియా సోని (25) చనిపోయింది. అలాగే, యూపీకి చెందిన శ్రేయా యాదవ్ (25), కేరళకు చెందిన నవీన్ డాల్విన్ (28) ప్రాణాలు కోల్పోయారు.
మిగిలిన 15 మందిని ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేసి కాపాడింది. నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్లో లైబ్రరీ ఏర్పాటు చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ సేఫ్టీ అధికారులు తెలిపారు. స్టోరేజీ కోసం వాడుకోవాల్సిన ఏరియాలో యాజమాన్యం లైబ్రరీ ఏర్పాటు చేసింది. బేస్మెంట్లో నీళ్లు చేరుతున్నాయని, లోపల స్టూడెంట్లు చిక్కుకున్నారని అటు పోలీసులకు.. ఇటు మున్సిపల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని తోటి స్టూడెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ముగ్గురు చనిపోయారని పలువురు స్టూడెంట్లు రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ముందు ధర్నాకు దిగారు.
ప్రమాదానికి కారణమేంటి?
రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అనేది రాజేంద్రనగర్ వీధిలోని లోతట్టు ప్రాంతంలో ఉంది. భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతం కావడంతో బేస్మెంట్ తలుపులు పగిలిపోయాయి. గ్రౌండ్ లెవల్ నుంచి 8 ఫీట్ల లోతులో బేస్మెంట్ ఉంది. దీంతో నీళ్లు వేగంగా లోపలికెళ్లాయి. స్ట్రీట్‌లోని డ్రైనేజీలు ఓవర్ ఫ్లో కావడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లైబ్రరీలోని ఫర్నీచర్, బుక్స్ నీళ్లలో తేలడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందైంది. ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నట్టు పోలీసులు వివరించారు.
శ్రీరాంపూర్ ఏరియాలో విషాదం
ఢిల్లీ రాజేంద్రనగర్ లోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ లో వరద పోటెత్తడంతో సింగరేణి మేనేజర్ విజయ్ కుమార్ కూతురు తానియా సోని చనిపోయింది. ఈ ఘటనతో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో విషాదం నెలకొన్నది. ఎస్సార్పీ 1 సింగరేణి బొగ్గు గని మేనేజర్‌గా విజయ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. బిహార్‌కు చెందిన విజయ్ కుమార్, బబిత దంపతులకు తానియా సోని, ఫలక్, ఆదిత్యకుమార్ సంతానం. ఆరు నెలల కిందే సివిల్స్‌లో కోచింగ్ తీసుకునేందుకు తానియా ఢిల్లీ వెళ్లింది. శనివారం సాయంత్రం రెండో కూతురు ఫలక్ను కాలేజ్‌లో జాయిన్ చేసేందుకు విజయ్‌కుమార్ కాన్పూర్ బయలుదేరారు. నాగ్‌పూర్ లో ఉన్నప్పుడే తానియా చనిపోయిందని సమాచారం అందడంతో అటు నుంచే ఢిల్లీకి వెళ్లారు.
ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా
సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటనపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలు తానియా సోని బీహర్ రాష్ట్రానికి చెందిన యువతి అని, ఆమె తండ్రి విజయ్‌కుమార్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని రెసిడెంట్ కమిషనర్ సీఎం రేవంత్‌కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా, తానియా సోని మృతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆమె తండ్రితో ఫోన్లో మాట్లాడి సానుభూతి తెలిపారు.
శ్రేయ తండ్రి.. పాల వ్యాపారి
శ్రేయ కుటుంబ సభ్యులు యూపీలోని అంబేద్కర్ నగర్ లో ఉంటారు. ఏప్రిల్‌లోనే శ్రేయ.. రావూస్ కోచింగ్ సెంటర్ లో అడ్మిషన్ తీసుకున్నది. శ్రేయ తన ఇంటిలో మొదటి సంతానం. తండ్రి రాజేంద్ర యాదవ్ పాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బిడ్డ చనిపోయిన విషయం టీవీలో చూసే తెలుసుకున్నామని ఘాజియాబాద్‌లో ఉంటున్న ఆమె మామయ్య ధర్మేంద్ర యాదవ్ తెలిపారు. కాగా, 28 ఏండ్ల నవీన్ డెల్విన్ది కేరళలోని ఎర్నాకుళం. ఇతను జేఎన్‌యూలో రీసెర్చ్ స్టూడెంట్.
కోచింగ్ సెంటర్ నిర్వాహకుల అరెస్ట్
సివిల్స్ అభ్యర్థుల మృతి ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కో ఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌ను అరెస్టు చేశారు. వీరిపై హత్యానేరం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరామర్శించేందుకు వచ్చిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌ను స్టూడెంట్లు అడ్డుకున్నారు. డ్రైనేజీ సిస్టమ్ బాగా లేదని పది రోజులుగా అధికారులకు చెప్తున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ స్పష్టం చేశారు. బేస్మెంట్లో ఉన్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని డివిజనల్ కమిషనర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు.
అసలేం జరిగింది?
ఓల్డ్ రాజేంద్రనగర్‌లో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం మొదలైంది. రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లో లైబ్రరీ ఉంది. 150 మంది వరకు కూర్చోవచ్చు. ఆ టైమ్‌లో 18 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. వరద ఉధృతి కారణంగా బేస్మెంట్ తలుపులు పగిలిపోయాయి. బయట ఉన్న స్టూడెంట్లు పోలీసులకు, మున్సిపల్ అధికారులకు 6.30 గంటలకు పరిస్థితి వివరించారు. వాళ్లు రాత్రి 9గంటలకు వచ్చారు. అప్పటికే బేస్మెంట్లో నీళ్లు నిండిపోయాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సేఫ్టీ బృందం.. పది మోటార్లతో నీళ్లను బయటికి తోడటం మొదలుపెట్టారు. అతి కష్టం మీద 15 మందిని రెస్క్యూ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు ముగ్గురు స్టూడెంట్ల డెడ్‌బాడీలను గుర్తించి బయటికి తీసుకొచ్చారు. వారిని తానియా, శ్రేయ, నవీన్‌గా గుర్తించారు.
స్టూడెంట్లు చనిపోవడం బాధాకరం: రాహుల్ గాంధీ
వ్యవస్థల వైఫల్యం కారణంగానే ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. టౌన్‌ప్లానింగ్, ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలిపారు. వ్యవస్థల నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదని అన్నారు. ‘‘స్టూడెంట్లు చనిపోవడం చాలా దురదృష్టకరం. కొద్దిరోజుల కింద వర్షాలకు కరెంట్ షాక్‌తో ఓ స్టూడెంట్ చనిపోయాడు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’అని అన్నారు.