
కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే.. ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలకు అక్కడి సిబ్బంది రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా తీసుకున్న ముగ్గురిలో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో ఆ విషయం కాస్తా బయటపడింది.
షామ్లీ జిల్లాలోని కంధాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిన్న(గురువారం) సరోజ్ (70), అనార్కలి (72), సత్యవతి (60) కలిసి వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకునేందుకు స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. వెంటనే అక్కడి అధికారులు ఒక్కొక్కరితో రూ.10ల సిరంజిలు కొనిపించారు. ఆ తర్వాత వారికి కరోనా వ్యాక్సిన్ బదులు రేబిస్ టీకాలు వేసి పంపించారు. టీకా వేయించుకుని ఇంటికి వెళ్లిన సరోజ్ మత్తుగా ఉండడాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. టెస్ట్ చేసిన డాక్టర్ ఆమెకు రేబిస్ టీకా వేసినట్టు గుర్తించాడు.
వ్యాక్సిన్ వేసిన వైద్య సిబ్బందిపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.