- వికలాంగులుగా మారిన మరో ముగ్గురు
- కారేపల్లి మండలం చీమలపాడులో గుడిసెకు మంటలు
- ఇంటి పెద్దను కోల్పోయి వీధిన పడ్డ కుటుంబాలు
- కనీసం మూడు చక్రాల బండి కూడా ఇవ్వని బీఆర్ఎస్ పెద్దలు
- చదువుకోవాల్సిన వయస్సులో కూలీలుగా మారిన బాధితుల పిల్లలు
- పెళ్లీడుకి వచ్చిన అమ్మాయిలతో మరో ఒంటరి మహిళ ఇబ్బందులు
ఖమ్మం/ కారేపల్లి, వెలుగు: బీఆర్ ఎస్ పార్టీ రాజకీయ సంబురం ఏడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మూడేళ్ల కింద జరిగిన ఆ ఘటన ఇప్పటికీ బాధితుల కళ్లల్లో కన్నీటి సుడులు తెప్పిస్తోంది. ఆత్మీయ సమ్మేళనం పేరుతో బీఆర్ఎస్ నిర్వహించిన సభ సందర్భంగా సంబురం కోసం పేల్చిన పటాకుల కారణంగా నలుగురు చనిపోగా, ముగ్గురు దివ్యాంగులుగా మారారు. ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఒకరు కూలీగా మారితే, తండ్రిని కోల్పోవడంతో ఉన్నత చదువులు చదువుకోవాల్సిన వయస్సులో మరో ఫ్యామిలీలోని పిల్లలు కూలీ పనులకువెళ్తున్నారు.
ఏళ్లు గడుస్తున్నా ఇంకా అప్పటి ఘటనను మర్చిపోలేక, తమను విడిచి వెళ్లిన వారిని తలుచుకుంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ పరంగా ప్రకటించిన సాయాన్ని అందించినా, పార్టీ తరపున ప్రకటించిన సాయాన్ని మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, జీవనోపాధి కల్పన వంటి హామీలు నీటి మూటలుగానే మిగిలాయని వాపోతున్నారు. మూడేళ్లు గడిచినా కనీసం మూడు చక్రాల బండి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ రోజు ఏం జరిగిందంటే!
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో 2023 ఏప్రిల్ 12న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కారేపల్లి మండలం చీమలపాడులో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటుచేశారు. అప్పటి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, అప్పటి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వేదిక వద్దకు వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహంతో పటాకులు కాల్చారు.
ఆ నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గుడిసెపై పడడంతో నిప్పంటుకుంది. మంటల కారణంగా ఆ గుడిసెలోని సిలిండర్ పేలడం, సిలిండర్ దూసుకెళ్లడంతో నలుగురు చనిపోయారు. మరో ముగ్గురు కాళ్లు కోల్పోయి వికలాంగులుగా మారారు. ఈ ఘటనలో కారేపల్లి మండలం గేట్ రేలకాయలపల్లికి చెందిన ధర్మసోత్ లక్ష్మణ్, స్టేషన్ చీమలపాడుకు చెందిన బానోత్ రమేశ్, చీమలపాడుకు చెందిన అజ్మీరా మంగు, మహారాష్ట్రకు చెందిన వలస కూలీ సందీప్ చనిపోగా, వెంకిటియా తండాకు చెందిన ఆంగోతు రవికుమార్, తలసిబోడుకు చెందిన భాస్కర్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నవీన్ కాళ్లు పోగొట్టుకున్నారు.
ఘటన జరిగిన మూడు వారాల్లో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, కాళ్లు కోల్పోయిన వారి ఫ్యామిలీలకు రూ.2.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందజేశారు. అయితే పార్టీ తరపున ప్రకటించిన మరో రూ.5 లక్షల సాయంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇతర ఏ ఒక్క హామీ నెరవేరలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
నలుగురు ఆడపిల్లల బాధ్యతలు మోస్తూ...
గేట్ రేలకాయలపల్లి గ్రామానికి చెందిన ధర్మసోత్ లక్ష్మణ్ చనిపోవడంతో ఆయన భార్య సరోజ నలుగురు ఆడపిల్లలను సాకేందుకు నానా కష్టాలు పడుతోంది. ఇద్దరికి పెళ్లిళ్లు కాగా, మరో ఇద్దరిని కూలీ పనులు చేసి చదివిస్తోంది. ఆ ఇద్దరి పెళ్లిళ్లు ఆ తల్లికి భారంగా మారాయి. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు మాత్రమే అందాయని, మిగిలిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని వాపోతోంది.
భూమి, ఇల్లు, ఉద్యోగంతో పాటు పార్టీ నుంచి మరో రూ.10 లక్షల ఇస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వం ఉంటే రూ.2 లక్షలు వస్తాయని అంటే సభ్యత్వ కాగితం పార్టీ నాయకులకు అప్పజెప్పానని, ఆ సొమ్ము కూడా అందలేదని వాపోయింది. రెక్కల కష్టంతో ఆడపిల్లలను పోషిస్తున్నానని సరోజ చెబుతోంది.
ఆఫీసర్లు కూడా హామీలు ఇచ్చారు
పేలుడు ఘటన జరిగిన ప్రదేశంలోనే మా నాన్న మంగు డెడ్ బాడీతో ఆందోళన చేశాం. అప్పటి అధికారులు భూమి, ఉద్యోగం, ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నుంచి కూడా మరో రూ.10 లక్షలు ఇప్పిస్తామని నాయకులు చెప్పారు. ఏ ఒక్క హామీ నెరవేరలేదు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన మేము, అమ్మతో కలిసి కూలీ పనులు చేస్తూ బతుకుతున్నాం.
- అజ్మీరా ఉమేశ్-
కూలీ పనులకు వెళ్తున్నాం
స్టేషన్ చీమలపాడుకి చెందిన బానోత్ రమేశ్ సిలిండర్ పేలుడు ఘటనలో చనిపోయాడు. ఇంటి యజమానిని కోల్పోవడంతో భార్య జ్యోతి, కూతురు శైలజ, కొడుకు సాయి కష్టాలు పడుతున్నారు. తండ్రి చనిపోవడంతో ఇద్దరు పిల్లలు చదువు మధ్యలో మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు. రేకుల ఇంట్లో ఉంటూ చదువులు మానేసి కూలీ పని చేసుకుని బతుకుతున్నామని వారు తెలిపారు. అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదని, పరామర్శకు వచ్చిన నాయకులు హామీలు ఇచ్చారే తప్ప ఏమీ ఇవ్వలేదు.
