పరువు తీసిందని గొంతు నులిమాడు

V6 Velugu Posted on Jul 14, 2019

చౌటుప్పల్‍, వెలుగు: కుటుంబం పరువు తీసిందనే కోపంతో కన్నకూతురిని కడతేర్చేందుకు ప్రయత్నించాడో తండ్రి.. గొంతు నులమడంతో స్పృహ తప్పిన కూతురిని చూసి చనిపోయిందని నమ్మి వెళ్లిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​మండలం పంతంగి గ్రామంలో జరిగిన ఈ దారుణం వివరాలు.. గ్రామానికి చెందిన సుక్క స్నేహశీలి(22), బోయ శేఖర్‍(25)లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. స్నేహశీలి తల్లిదండ్రులు గత నెల 14న హైదరాబాద్‍లోని జిల్లేలుగూడకు చెందిన నరేశ్‍తో ఆమె పెళ్లి చేశారు. పెళ్లయ్యాక వారం రోజులకు 20 తేదీన శేఖర్‍, స్నేహశీలిలు పారిపోయారు. కుటుంబ సభ్యులు వెతికి ఇంటికి తీసుకొచ్చారు. శేఖర్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ పెట్టి పెద్ద మనుషులతో చెప్పించారు. అయినా ఈ నెల 10న ఇద్దరూ కలిసి మళ్లీ పారిపోయారు. తల్లిదండ్రులు మళ్లీ పట్టుకొచ్చారు. ఈ క్రమంలో నరేశ్‍ బంధువులతో వచ్చి పంచాయతీ పెట్టాడు.

దీంతో పరువు పోయిందని భావించిన తండ్రి యాదయ్య కూతురు స్నేహశీలిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. స్నేహశీలిని శేఖర్‍కు దూరం పెట్టేందుకుగానూ సంస్థాన్‍ నారాయణపురం మండలం కంకణాలగూడెంలోని బంధువుల ఇంటి వద్ద ఉంచాడు. శుక్రవారం రాత్రి స్నేహశీలిని ఇంటికి తీసుకొద్దామని వెళ్లిన యాదయ్య మార్గమధ్యంలో కూతురు గొంతు నులిమాడు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో, చనిపోయిందని నమ్మి ఇంటికెళ్లాడు. ఇంట్లో వాళ్లకు, గ్రామస్థులకు కూతుర్ను చంపేశానని చెప్పాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అదేరాత్రి పోలీసులు వెళ్లి చూడగా, స్నేహశీలి స్పృహతప్పి ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‍లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి యాదయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tagged Choutuppal, Murder attempt

Latest Videos

Subscribe Now

More News