సిట్టింగ్​లకు టికెట్ టెన్షన్.. వణుకు పుట్టిస్తున్న ఆశావహులు

సిట్టింగ్​లకు టికెట్ టెన్షన్.. వణుకు పుట్టిస్తున్న ఆశావహులు
  •     సొంత పార్టీలోనే వణుకు పుట్టిస్తున్న ఆశావహులు
  •     తెరపైకి రోజుకో పేరు వస్తుండడంతో క్యాడర్ లో కన్ఫ్యూజన్
  •     ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి


కరీంనగర్, వెలుగు : అసెంబ్లీ  ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  బీఆర్​ఎస్​ సిట్టింగ్  ఎమ్మెల్యేలకు టికెట్ భయం పట్టుకుంది. ప్రత్యర్థి పార్టీల  పోటీ కన్నా.. సొంత పార్టీలో  అసమ్మతిని చూసి  ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.  బీఆర్​ఎస్​ నేతలే సొంత ఆఫీసులు ఓపెనింగ్ చేస్తుండడం, వాల్ రైటింగ్స్, సీక్రెట్ మీటింగ్స్, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేయిస్తుండడం చూసి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు. గ్రూపులు కట్టడం, పార్టీ పెద్దలకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు  చేస్తుండడం, పార్టీ మీటింగ్స్ లో ఓపెన్ గానే విమర్శలు గుప్పిస్తుండడం వారికి తలనొప్పిగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, చొప్పదండి, వేములవాడ, రామగుండం, జగిత్యాల, ధర్మపురి, పెద్దపల్లి తదితర మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 

టికెట్లపై క్లారిటీ ఇవ్వని హైకమాండ్​ .. 

ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఒకటి, రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా టికెట్ల విషయంలో  హైకమాండ్, పార్టీ పెద్దలు భరోసా ఇవ్వడం లేదు. పైగా సిట్టింగుల్లో కొందరిని మార్చక తప్పదని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు పార్టీ  మీటింగ్స్ లో  చెప్పడం వీరిని కలవరపెడుతోంది.  అంతేగాక సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా, బీఆర్ఎస్ అగ్రనేతగా పేరున్న మాజీ ఎంపీ, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ ఇటీవల చేసిన కామెంట్స్ వారిని మరింత టెన్షన్ కు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.   

  •  చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీరుపై బీఆర్ఎస్ క్యాడర్ లో, నియోజకవర్గ కీలక నేతల్లో తీవ్ర అసంతృప్తి పెరగడంతో వారం రోజుల క్రితం వారితో  కరీంనగర్ లోని ఓ హోటల్ లో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని ముఖ్య లీడర్లంతా ఎమ్మెల్యే రవిశంకర్ పై ఆయన ఎదుటే వినోద్ కుమార్ కు ఫిర్యాదులు చేశారు. రవిశంకర్ ను మార్చాల్సిందేనని పట్టుబట్టారు. రవిశంకర్ కు టికెట్ రాకుండా అడ్డుకునే విషయంలో కొడిమ్యాల మండల నేతలు కీలకంగా పని చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు టికెట్ ఆశిస్తున్న నలుగురు నాయకుల్లో ఇద్దరు ఇప్పటికే ఆఫీస్ ఓపెనింగ్ చేయడంతోపాటు వాల్ రైటింగ్స్ మొదలు పెట్టించడం, తమకు పార్టీ ముఖ్య నేతల అండ ఉందని ప్రచారం చేసుకుంటుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. 
  •  ఇటీవల మానుకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి లో నిర్వహించిన డబుల్ రోడ్డు శంకుస్థాపన సభలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని, మంత్రి పదవి వచ్చేలా చూడాలని జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి కోరగా వినోద్ కుమార్ చేసిన కామెంట్స్ ఎమ్మెల్యేను, ఎమ్మెల్యే అనుచరులను టెన్షన్ కు గురి చేస్తున్నాయి. గెలవని ఎమ్మెల్యేలను మారుస్తారని అంటూనే పక్కనే ఉన్న బీఆర్ ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కు తగిన ప్రాధాన్యత దక్కుతుందని ప్రకటించడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటనే చర్చ జోరుగా సాగుతోంది. 
  • పౌరసత్వ వివాదం తేలకపోవడం, గత ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీతో గెలవడం, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలతో  ఈ సారి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ బాబుకు అధిష్టానం టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆ పార్టీ నేత చల్మెడ లక్ష్మీ నరసింహారావు రెండు నెలల క్రితం ఆఫీస్ ఓపెన్ చేశారనే ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతూ, పార్టీ కార్యకర్తల్లోనూ ఉత్సాహం నింపుతున్నారు. 
  • జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పొసగని తెలంగాణ ఉద్యమకారుడు జితేందర్ రావు, బీఆర్ఎస్  సీనియర్ నేత వోరుగంటి రమణరావు కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 
  • ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుల ఆగడాలకు అంతులేకుండా పోయిందనే విమర్శ ప్రజల్లో ఉంది. పైగా 2018 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ కుమార్ పై గెలిచారు. ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పటికే నియోజకవర్గ ప్రజల్లో లక్ష్మణ కుమార్ పై ఓడిపోయిన సింపతీ ఉన్నట్లు సర్వేల్లో వెల్లడి కావడంతో అభ్యర్థి మార్పుకే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 
  •  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై వారం రోజుల క్రితం ఆ పార్టీ అసమ్మతి నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైదరాబాద్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. ఆయనను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించినా ఫర్వాలేదని, కానీ ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వొద్దని పట్టుబట్టారు. ఆర్‌ఎఫ్ సీఎల్‌లో ఉద్యోగాల కోసం వసూళ్లకు పాల్పడడం పార్టీకి చెడ్డ పేరు తెచ్చిందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పార్టీ అధిష్టానం కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. 
  • పెద్దపల్లి ఎమ్మెల్యేగా రెండుసార్లు వరుసగా గెలిచిన దాసరి మనోహర్ రెడ్డికి వచ్చే ఎన్నికలు మాత్రం సవాల్ గా మారనున్నాయి. ఆయనపై సొంత పార్టీ నేతలే కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.  మంత్రి కేటీఆర్ కు సన్నిహితులుగా పేరున్న నల్ల మనోహర్ రెడ్డి, బొద్దుల లక్ష్మణ్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో పద్మశాలీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఈ క్రమంలోనే  పద్మశాలీ కోటాలో లక్ష్మణ్ టికెట్ ఆశిస్తున్నారు. నల్ల మనోహర్ రెడ్డి ఐదేండ్లుగా స్వచ్చంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు.