గూగుల్ పే, ఫోన్ పే స్కాన్ చేసి బస్సు టికెట్లు తీసుకోవచ్చు

గూగుల్ పే, ఫోన్ పే స్కాన్ చేసి బస్సు టికెట్లు తీసుకోవచ్చు

ఆర్టీసీ బస్సుల్లోనూ గూగుల్ పే, ఫోన్ పే స్కాన్ చేసి టికెట్లు తీసుకోవచ్చు. లేదంటే డెబిట్/ క్రెడిట్ కార్డులను స్వైప్ చేసినా సరిపోతుంది. సూపర్ లగ్జరీ, గరుడ, ఇంద్ర, వోల్వో బస్సుల్లో ఈ అవకాశం కల్పిస్తున్నారు. 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఇకపై చేతిలో క్యాష్ లేకపోయినా నో ప్రాబ్లమ్. చార్జీలకు సరిపడా చిల్లర కోసం వెతుక్కోవాల్సిన పని కూడా లేదు. స్మార్ట్ ఫోన్​తో గూగుల్ పే లేదా ఫోన్ పే క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేయడం ద్వారా డబ్బులు పంపి టికెట్లు తీసుకోవచ్చు. లేదంటే డెబిట్/క్రెడిట్ కార్డులను స్వైప్ చేసినా టికెట్లు ఇస్తారు. ప్రస్తుతానికి సూపర్ లగ్జరీ, గరుడ, ఇంద్ర, వోల్వో బస్సుల్లో ఈ అవకాశం కల్పిస్తున్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం సిటీ బస్సుల్లో, ఏడాదిలోపు రాష్ట్రమంతా డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో గూగుల్ పే, ఫోన్ పే, డెబిట్/క్రెడిట్ కార్డులతో టికెట్లు తీసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో 900 కొత్త ఐ టిమ్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మెషీన్)లను ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగే డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకునే పద్ధతి కూడా యథావిధిగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.  

10 వేల ఐ టిమ్​లు కావాలె.. 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని  బస్సుల్లో టిమ్ (టికెట్ ఇష్యూయింగ్ మెషీన్)ల ద్వారా ప్యాసింజర్లకు టికెట్లు ఇస్తున్నారు. వీటి లైఫ్ టైమ్ మూడేండ్లు ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా గూగుల్ పే, ఫోన్ పే కోడ్ స్కానింగ్, డెబిట్ కార్డుల స్వైపింగ్​తో టికెట్లు ఇచ్చేలా మార్పులు చేసేందుకుగాను టిమ్​ల స్థానంలో ఐ టిమ్​లను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 900 ఐ టిమ్​లతో రోజూ 11 వేల వరకు టికెట్లు ఇస్తున్నారు.  ఒక్కో ఐ టిమ్ ధర రూ. 14 వేల వరకు ఉందని, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలంటే 10 వేల వరకు ఐ టిమ్​లు కావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అందుకే దశలవారీగా ఏడాదిలోపు పల్లె వెలుగు మినహా అన్ని బస్సుల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు చెబుతున్నారు. బస్ స్టేషన్లు, రిజర్వేషన్ సెంటర్లలో సైతం క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లను అమలు చేస్తామంటున్నారు. 

చిల్లర సమస్యకు చెక్ 

ఆర్టీసీ బస్సుల్లో ఎన్నో ఏండ్లుగా చిల్లర సమస్యలు వస్తున్నయి. గ్రామాల్లో ప్యాసింజర్లకు ఇచ్చేందుకు చేంజ్ లేకపోవటంతో ఇద్దరు, ముగ్గురికి కలిపి పంచుకోవాలని చెప్తూ కండక్టర్లు నోట్లు  ఇస్తున్నరు. దీంతో కండక్టర్లకు ప్యాసింజర్లకు మధ్య కొట్లాటలు జరుగుతున్నయి. కొత్త పద్ధతితో ఈ చిల్లర సమస్య రాదని అధికారులు చెబుతున్నారు.  కాగా, ఐటిమ్​లతో టికెట్ల జారీపై డ్రైవర్లకు ట్రైనింగ్ ఇస్తున్నామని  సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్​) మునిశేఖర్​ చెప్పారు. మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపిస్తున్నా.. కొన్ని రోజులు పోతే వీటిని వాడటం డ్రైవర్లకు ఈజీ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు.