పశువుల కాపరిపై పులి దాడి .. కాగజ్​నగర్​ దవాఖానకు తరలింపు 

పశువుల కాపరిపై పులి దాడి .. కాగజ్​నగర్​ దవాఖానకు తరలింపు 
  • కుమ్రం భీం జిల్లా నందిగూడ శివారులో అటాక్​
  • గాయాలతో తప్పించుకున్న వ్యక్తి  

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌నగర్‌‌ మండలంలో పశువుల కాపరిపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో అతడు గాయాలతో బయటపడ్డాడు. మండలంలోని నందిగూడకు చెందిన పశువుల కాపరి గులాబ్.. రోజూ మాదిరిగానే మంగళవారం కూడా పశువులను తోలుకొని ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రం తిరిగివస్తుండగా పెద్దపులి ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. గులాబ్ భయంతో గట్టిగా ‘పులి...పులి’ అని అరవడంతో చుట్టుపక్కలే ఉన్న గ్రామస్తులు కూడా పెద్దగా అరుస్తూ పరిగెత్తుకు వచ్చారు.

దీంతో పులి అక్కడి నుంచి పారిపోయింది. అప్పటికే గులాబ్ పొట్ట, చేతులకు గాయాలయ్యాయి. బాధితుడిని కాగజ్‌‌నగర్‌‌ లోని దవాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి విషయం తెలుసుకున్న కాగజ్ నగర్ ఎఫ్ డీఓ వేణు, ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్ హాస్పిటల్ కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ప్రజలెవరూ పులి ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని హెచ్చరించారు. కాగా, గడిచిన 15 రోజుల్లో పులి సుమారు 20 పశువులపై దాడి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని పశువుల కాపరులు, గ్రామస్తులు మండిపడుతున్నారు. పులిని బంధించాలని కోరుతున్నారు.