పులి చర్మం స్వాధీనం !

పులి చర్మం స్వాధీనం !

ఆసిఫాబాద్/కాగజ్‌‌నగర్‌‌, వెలుగు : కాగజ్‌‌నగర్‌‌ ఫారెస్ట్‌‌ డివిజన్‌‌లోని పెంచికల్‌‌పేట రేంజ్‌‌లో ఈ నెల 16న పులి మరణం, దాని చర్మం, గోళ్లు, పండ్లను వేటగాళ్లు ఎత్తుకెళ్లడం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు పులికి సంబంధించిన చర్మం, గోళ్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పులిని చంపడం, దాని చర్మం, గోళ్లు, పండ్లు, మీసాలు, పాదాలు ఎత్తుకెళ్లడాన్ని సీరియస్‌‌గా తీసుకున్న ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

బెల్లంపల్లి కేంద్రంగా ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మొదట తమకేమీ తెలియదని బుకాయించిన నిందితులు చివరకు నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పులిని ఎలా చంపింది ? చర్మం, ఇతర భాగాలను దాచిపెట్టిన ప్లేస్‌‌ గురించి చెప్పడంతో ఆఫీసర్లు సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

జిల్లా ఫారెస్ట్‌‌ ఆఫీసర్ నీరజ్‌‌కుమార్‌‌ టిబ్రేవాల్‌‌ మరికొందరు ఆఫీసర్లతో కలిసి పులి చనిపోయిన ప్రాంతంలో సీన్‌‌ రీకన్స్ట్రక్షన్‌‌ చేసినట్లు తెలుస్తోంది. అసిఫాబాద్‌‌లో విచారణ చేస్తే అడ్డంకులు వస్తాయని భావించిన ఆఫీసర్లు బెల్లంపల్లి కేంద్రంగా విచారణ జరిపినట్లు పలువురు భావిస్తున్నారు. పులిని వేటాడిన ప్రధాన నిందితుల్లో ముగ్గురు దహేగాం మండలం రాస్పల్లికి చెందిన వారు కాగా, ఇద్దరు పెంచికల్‌‌పేటకు చెందిన వారుగా తెలుస్తోంది.