కాగజ్ నగర్, వెలుగు: సిర్పూర్ టీ ఫారెస్ట్ రేంజ్ లోని ఇటికెల పహాడ్ ప్లాంటేషన్‌లో ఇటీవల పులి సంచారం రెగ్యులర్‌గా ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అలర్ట్గా ఉండాలని.. తెల్లవారుఝామున, రాత్రిపూట అటవీ మార్గంలో ప్రయాణించవద్దని సిర్పూర్ టీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఆదివారం ఉదయం ఇటికెల పహాడ్ ప్లాంటేషన్ సమీపంలోని వాగు ప్రాంతంలో రోడ్డు మీద పులి పాదముద్రలను గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో సిబ్బంది అక్కడకు చేరుకుని పగ్ మార్క్‌లు పరిశీలించారు. అనంతరం ట్రాకింగ్ చేశారు. గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఉదయం 9 గంటల తర్వాతే పంట చేనులు, పొలాలకి వెళ్లాలని, సాయంత్రం చీకటిపడే సమయానికి ముందే ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. పంట చేనుల్లో గుంపులుగా తిరగాలన్నారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, హాని తలపెట్టేలా ఎవరూ ప్రయత్నించవద్దని సూచించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వల్క మోహన్ రావు, ట్రాకర్లు, వాచర్లు ఉన్నారు.
