కొమురం భీం జిల్లా: వారం రోజులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అడవిని వదిలి జనావాసాలకు దగ్గరగా సంచరిస్తున్న పెద్దపులి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. దాదాపు ఆరు రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
ఊహించినట్లే ఇవాళ బెజ్జూరు మండలం మర్తిడి గ్రామ సమీపంలో నీటి కుంట వద్ద పెద్దపులి పడుకుని ఉంది. ఉదయమే పొలం పనులకు బయలుదేరిన రైతులు, వ్యవసాయ కూలీలు నీటి కుంట వద్ద పెద్దపులి కనిపించడంతో భయంతో గ్రామంలోకి పరుగులు తీశారు.
ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు దావానలంలా పాకడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల భయాందోళనల నేపథ్యంలో పెద్దపులి జాడ కోసం వెతుకుతున్న ఫారెస్ట్ అధికారులు అన్వేషణను ముమ్మరం చేశారు. ఖానాపూర్ కు చెందిన ఓ వ్యక్తిని, ఆవు, గొర్రె, దుప్పిని దాడి చేసి హతమార్చిన ఘటనల నేపథ్యంలో పెద్దపులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిన్న రాత్రి బెజ్జూర్ మండలం కుకుడ గ్రామంలో శ్యామ్ రావు అనే రైతు కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దుపై రాత్రి పెద్దపులి దాడి చేసింది. అక్కడ ఉన్న పాదముద్రలతో పెద్దపులి దాడి చేసిట్లు నిర్ధారించుకున్న ఫారెస్ట్ అధికారులు దాని అడుగు జాడల ఆధారంగా అన్వేషణ చేస్తుండగా.. తెల్లారే సరికి మర్తిడి గ్రామ సమీపంలో కనిపించింది. పెద్దపులి సంచారం నేపథ్యంలో పరిసర ప్రాంతాలు గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని.. గుంపులు గుంపులుగా తిరగాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.