చైనా నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్న టిక్‌టాక్‌

చైనా నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్న టిక్‌టాక్‌
  • యూకేలో హెడ్‌ క్వార్టర్స్‌ పెట్టేందుకు..
  • చర్చలు జరుపుతున్న టిక్‌టాక్‌

లండన్‌: చాలా తక్కువ కాలంలో ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న యాప్‌ టిక్‌టాక్‌ చైనా నుంచి మక్కాం మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చైనా యాప్‌ అనే కారణంగా చాలా దేశాలు యాప్‌ను బ్యాన్‌ చేయాలనే ఉద్దేశంలో ఉన్నందున హెడ్‌ క్వార్టర్స్‌ను చైనా నుంచి యూకేకి మార్చాలని చూస్తోంది. ఈ మేరకు యూకే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని టిక్‌టాక్‌కు చెందిన ఒక అధికారి చెప్పారు. అయితే యూకే దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు. పరిశీలనలో ఉన్న ఇతర ప్రదేశాల గురించి సమాచారం లేదని అన్నారు. అమెరికాలో కూడా టిక్‌టాక్‌కు భారీ వ్యతిరేకత వచ్చింది. అందుకే లండన్‌ దానికి సేఫ్‌ ప్లేస్‌ అని భావించిన టిక్‌టాక్‌ ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు యూకేలో వర్క్‌ ఫోర్స్‌ను పెంచాలని చూస్తోందని సమాచారం. చైనాలో కాకుండా ప్రపంచంలోని మిగతా ప్రదేశాల్లో విస్తరించాలని చూస్తున్నట్లు అధికారులు చెప్పారు. కాగా.. టిక్‌టాక్‌తో బ్రిటన్‌ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయనే సమాచారం కూడా ఉంది. టిక్‌టాక్‌ చైనా ప్రభుత్వానికి తన యూజర్ల సమాచారం ఇస్తుందని, సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఆరోపణలతో ఇండియాలో టిక్‌టాక్‌ సహా 59 యాప్స్‌ను బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే.