బిలియనీర్ క్లబ్ లో టిమ్ కుక్

బిలియనీర్ క్లబ్ లో టిమ్ కుక్

యాపిల్ షేర్లతోపాటే పెరిగిన సంపద

న్యూఢిల్లీ: స్మార్ట్‌‌ఫోన్‌‌ కంపెనీ యాపిల్‌‌ సీఈఓ టిమ్‌‌ కుక్‌‌ బిలియనీర్ క్లబ్‌ లోకి ఎంటర్‌‌‌‌ అయ్యారు. గత వారం యాపిల్‌‌ షేర్లు 5 శాతానికి పైగా లాభపడడంతో ఆయన సంపద బిలియన్‌‌ డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే గ్లోబల్‌‌గా మోస్ట్‌‌ వాల్యూడ్‌‌(మార్కెట్‌‌ క్యాప్‌ ప్రకారం) కంపెనీలలో ఆయిల్‌‌ ఆరామ్‌‌కోను దాటిన యాపిల్‌‌, ప్రస్తుతం 2 ట్రిలియన్‌‌ డాలర్ల మార్కెట్‌‌ క్యాప్‌ వైపు దూసుకుపోతోంది. ఈ కంపెనీలో టిమ్‌‌ కుక్‌‌ వాటా చాలా తక్కువగా ఉంది. ఇందులో కూడా స్టాక్‌‌ అవార్డ్‌‌ల కింద పొందిన షేర్లే ఎక్కువగా ఉన్నా యి. ప్రస్తుతం టిమ్‌‌కుక్‌‌కు యాపిల్‌‌లో 0.02 శాతం వాటా లేదా 8,47,969 షేర్లు ఉన్నాయి. వీటి విలువ 382 మిలియన్‌‌ డాలర్లుగా ఉంది.

ఇది ఫేస్‌‌బుక్ జుకర్‌‌‌‌ బర్గ్‌‌, అమెజాన్‌‌ జెఫ్‌ బెజోస్‌‌, టెస్లా ఎలన్‌‌ మస్క్ వంటి టెక్‌‌ లీడర్లకు తమ కంపెనీలలో ఉన్న వాటాల కంటే చాలా తక్కువ. ఈ సంపదతో పాటు ఆయన పొందిన డివిడెండ్లు , ఇతర ప్రోత్సాహకాలను కలిపితే టిమ్‌‌ కుక్‌‌ సంపద మరో 650 మిలియన్‌‌ డాలర్లకు చేరుకుంటుందని బ్లూమ్‌‌బర్గ్‌‌ లెక్కించింది. లక్షల కొద్దీ యాపిల్‌‌ షేర్లను కుక్ ఇప్పటికే దానం చేసేశాడని, బయటకు తెలియని దానాలు ఏవైనా చేసుంటే కుక్‌‌ సంపద బిలియన్‌‌ డాలర్ల కంటే తక్కువ ఉండొచ్చని తెలిసిన వారు చెప్పారు . స్టీవ్‌ జాబ్స్‌‌ చనిపోయేనాటికి యాపిల్‌‌ కంపెనీ మార్కెట్‌‌ క్యాప్‌ 350 బిలియన్‌‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌‌ క్యాప్‌ 2 ట్రిలియన్‌‌ డాలర్ల వైపు కదులుతోంది.

సోమవారం సెషన్‌‌లో కూడా యాపిల్‌‌ షేర్లు 1.45 శాతం పెరిగి రూ. 450.91 డాలర్ల వద్ద క్లోజయ్యాయి. టిమ్‌‌కుక్‌‌ 2011 లో యాపిల్‌‌ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. గత పదేళ్లలో ఐ–ఫోన్‌‌ లాంటి రివల్యూషనరీ ప్రొడక్ట్‌‌ను కంపెనీ తీసుకురానప్పటికీ, యాపిల్‌ సేల్స్‌‌ మాత్రం విపరీతంగా పెరిగాయి. యాపిల్‌‌ మ్యూజిక్, ఐఫోన్‌‌ ఎక్స్‌‌, యాపిల్‌‌ వాచ్‌ వంటి ప్రొడక్ట్‌‌లను కుక్‌ సారధ్యంలో యాపిల్‌ తెచ్చింది. వీటితో పాటు సెల్ఫ్‌ డ్రైవింగ్‌‌ కార్స్‌‌, రియల్టీ గ్లాసెస్‌‌ వంటి వాటిపై రీసెర్చ్‌‌ కూడా చేస్తోంది.