
- టికెట్ రాక కొందరు, సొంత పార్టీలో గొడవలతో ఇంకొందరు
- ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ పెరిగిపోతున్న ఫిరాయింపులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు మారుతున్న నేతల సంఖ్య పెరిగిపోతున్నది. టికెట్ రాలేదని కొందరు, సొంత పార్టీలోని నేతలతో ఇబ్బందులతో మరికొందరు, ఉన్న పార్టీలో భవిష్యత్తు లేదని ఇంకొందరు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఫాయిదా ఉంటుందని అనుకునే పార్టీల్లోకి.. ముందస్తు హామీ తీసుకుని చేరిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో అటూ ఇటూ మారుతున్న నేతల లిస్టు పెద్దగానే ఉంది. కొందరు నేతలైతే ప్రధాన పార్టీలన్నింటినీ చుట్టేసి.. గతంలో తాము పని చేసిన పార్టీలోకే తిరిగి వెళ్లిపోతుండటం గమనార్హం.
బీఆర్ఎస్ లిస్టు ప్రకటనతో షురూ
ఇటీవల బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 115 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. సీట్లు రాని లీడర్లు అసంతృప్తికి గురయ్యారు. తొలుత గొంతెత్తిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. తనను కాదని, ఎస్టీ కూడా కాని లీడర్‌కు టికెట్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. పార్టీని వీడకుండానే కాంగ్రెస్ టికెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇయ్యాల్నో రేపో కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. అదే కోవలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ కూడా ఉన్నారు.
ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో మూడు రోజుల కిందట రేవంత్‌ను కలిశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తాజాగా మేడ్చల్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన కొడుకు జెడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొన్ని నెలల కిందట గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత కూడా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల ప్రకటించిన స్థానాల్లో గద్వాల టికెట్‌ను సరితకు కాంగ్రెస్ కేటాయించింది.
తన కొడుకు రోహిత్‌కు టికెట్ ఇవ్వలేదన్న కారణంతో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే హన్మంతరావు బయటికి వచ్చారు. కాంగ్రెస్‌లో చేరి. తండ్రీ కొడుకులిద్దరూ టికెట్లు సాధించారు. నకిరేకల్ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఆ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరి.. టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ.. కాంగ్రెస్‌లో చేరి కల్వకుర్తి టికెట్ పొందారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు.. కొన్ని రోజుల కిందట ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కాంగ్రెస్‌లో లొల్లి
పార్టీలు మారుతున్న లీడర్లలో కాంగ్రెస్ నుంచీ ఎక్కువ మందే ఉంటున్నారు. టికెట్ల కోసం అప్లికేషన్లు స్టార్ట్ చేసిన దగ్గర్నుంచి.. ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసే దాకా చాలా మంది లీడర్లు అసంతృప్తికి లోనయ్యారు. మల్కాజ్‌గిరి టికెట్ రాలేదని నందికంటి శ్రీధర్, మెదక్ టికెట్ దక్కలేదని ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి.. కాంగ్రెస్‌ను వీడారు. దాదాపు 45 ఏండ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య కూడా టికెట్ రాదన్న అసంతృప్తితో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉప్పల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన రాగిడి లక్ష్మారెడ్డి కూడా బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు.
మేడ్చల్ టికెట్ దక్కలేదన్న కారణంతో హరివర్ధన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్‌లోకి వెళ్తారన్న చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌లో బీసీలకు సీట్ల కోసం కొట్లాడుతున్న సీనియర్ నేత చెరుకు సుధాకర్.. పార్టీ మారే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. బీఆర్ఎస్‌లోకి వెళ్లడంపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్‌లోకి జిట్టా బాలకృష్ణా రెడ్డి రావడంతో.. తనకు టికెట్ రాదని భావించిన యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ రెడ్డి.. బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఆయనతో చర్చలు జరిపి తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చారు. భువనగిరి టికెట్‌ను ప్రకటించారు. దీంతో టికెట్ తనకే వస్తుందని ఇన్నాళ్లూ ధీమాతో ఉన్న జిట్టా బాలకృష్ణా రెడ్డికి షాక్ తగిలింది. పార్టీలో చేరి నెల కూడా కాకుండానే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
బీజేపీ నుంచీ వలసలు
బీజేపీలో కనిపించిన జోష్ చూసి చాలా మంది లీడర్లు ఆ పార్టీలోకి క్యూ కట్టారు. అయితే కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో సీన్ మారింది. చాలా మంది బీజేపీ లీడర్లు ఆలోచనలో పడ్డారు. కొందరు బీఆర్ఎస్ వైపు వెళ్లగా.. మరికొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే నెల రోజుల కిందట జిట్టా బాలకృష్ణా రెడ్డి బీజేపీని వీడారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ నుంచి మహబూబ్‌నగర్ టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టు చెప్తున్నారు. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ కూడా నెలన్నర కిందట కాంగ్రెస్‌లో చేరి.. జహీరాబాద్ టికెట్ సాధించారు. రేవూరి ప్రకాష్ రెడ్డి గురువారం రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారన్న చర్చ జరుగుతున్నది.
లాభం ఉందనుకుంటేనే!
పార్టీలు మారే లీడర్లు తమకు వచ్చే ఆఫర్లను బట్టే నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రస్తుతమున్న పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదనుకుంటే.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ లేదా లోక్‌సభ టికెట్ల హామీలను తీసుకుని వాటిలో చేరుతున్నారు. లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులనూ ఇస్తారనే గ్యారంటీతో వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు సహా ఇతర లీడర్లకు డబ్బులు ఆఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఏదైనా తమకు ఫాయిదా ఉంటేనే పార్టీలో చేరుతున్నారని, సొంత ప్రయోజనం లేకుండా పార్టీలు మారే లీడర్లు అతికొద్ది మందే ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది.