డిఫమేషన్‎ను డీక్రిమినలైజ్ చేయాల్సిన టైమొచ్చింది: సుప్రీంకోర్టు

డిఫమేషన్‎ను డీక్రిమినలైజ్ చేయాల్సిన టైమొచ్చింది: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులను క్రిమినల్ నేరాల జాబితా నుంచి తప్పించాల్సిన టైమొచ్చిందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జేఎన్‎యూ ప్రొఫెసర్ ఒకరు ఓ మీడియా సంస్థపై దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేశ్​ఈ కామెంట్స్ చేశారు. భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 356 ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా ఇతరుల పరువు తీసేందుకు ప్రయత్నం ‘క్రిమినల్ నేరం’. 

ఓ వ్యక్తి పరువు ప్రతిష్టలను మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, సైగల ద్వారా కానీ భంగం కలిగించడం నేరమని చట్టాలు చెబుతుండగా.. జస్టిస్ సుందరేశ్​మాత్రం ఈ కేసులను డీక్రిమినలైజ్ చేయాల్సిన టైమొచ్చిందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం ప్రతీ వ్యక్తికి స్వేచ్ఛగా, స్వాతంత్రాలతో, మర్యాదగా బతికే హక్కు ఉంటుంది. 

ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ అంశం అత్యంత కీలకమైంది. పరువు నష్టానికి పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని, రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని భారతీయ న్యాయ సంహిత పేర్కొంది. ఇదే విషయాన్ని 2016లోనూ సుప్రీంకోర్టు ఉదహరించింది. పరువు నష్టం కేసులకు సంబంధించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి మద్దతుగా నిలిచింది.