
- నిమ్స్ తరహాలో టిమ్స్‌లకు స్వయం ప్రతిపత్తి
- అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: సనత్‌నగర్, కొత్తపేట్, అల్వాల్ టిమ్స్ హాస్పిటళ్లను కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా తీర్చిదిద్దాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఏఐజీ, అపోలో, యశోద, నిమ్స్, ఎయిమ్స్ హాస్పిటళ్ల తరహాలో శానిటేషన్, పేషెంట్ కేర్‌కు సమప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
నిమ్స్ తరహాలో టిమ్స్ లలోనూ స్వయం పాలన వ్యవస్థ ఉండాలన్నారు. త్వరలో సనత్ నగర్ టిమ్స్ ప్రారంభించనున్న నేపథ్యంలో.. మంగళవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐజీ, అపోలో, యశోద, నిమ్స్, ఎయిమ్స్‌లో అవలంభిస్తున్న విధానాలపై ఇప్పటికే అధికారులు స్టడీ చేసి రిపోర్టు తయారు చేశారు.
ఈ నివేదికలోని అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలు పనిచేస్తున్న విధానం, డాక్టర్లు, సిబ్బంది సంఖ్య, పెడుతున్న ఖర్చు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా, నిమ్స్ కంటే మెరుగైన హాస్పిటళ్లను ప్రజలకు అందించాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన అని మంత్రి తెలిపారు.
ఇందుకు అనుగుణంగా అన్నిరకాల వసతులతో హాస్పిటళ్లు ఉండాలని, అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్ల తరహాలో క్లినికల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, అకాడమిక్స్ విభాగాలు వేర్వేరుగా ఉండాలని సూచించారు. నిమ్స్ తరహాలో మెడికల్ డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్‌తోపాటుగా చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ కూడా ఉండాలన్నారు. ఏయే విభాగానికి ఎవరు బాధ్యులు, ఎవరి పని ఏంటి అన్నదానిపై స్పష్టమైన జాబ్ చార్ట్ ఉండాలని మంత్రి ఆదేశించారు. గతంలో ధనవంతులు, పెద్ద నాయకులు కూడా చికిత్స కోసం గాంధీ, ఉస్మానియాకు వెళ్లేవారని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు టిమ్స్‌లను ఆ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు.
సీజనల్ వ్యాధులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
సీజనల్ వ్యాధులు నమోదుకాని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులపై హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు కంట్రోల్‌లో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు.
గతేడాదితో పోలిస్తే సీజనల్ వ్యాధుల కేసులు తగ్గాయని డైరెక్టర్ అఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ కుమార్ తెలిపారు. వ్యాధులకు సంబంధించి మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. సమావేశంలో.. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో ఉదయ్ కుమార్, డీఎంఈ, నరేంద్ర కుమార్, డైరెక్టర్ అఫ్ హెల్త్ రవీందర్ కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ విమలా థామస్ పాల్గొన్నారు.