
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్ కు నిధుల గండం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి బిల్లులు పెండింగ్ లో ఉండడంతో హాస్పిటళ్ల పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో నిర్మిస్తున్న టిమ్స్ ను వచ్చే నెల 2న ప్రారంభిస్తామని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదివరకే ప్రకటించారు. పనులు చివరి దశకు చేరుకున్నామని ఆయన చెప్పారు. అంతకుముందు పనులు కూడా ఆయన తనిఖీ చేశారు.
అయితే పనులు 70 శాతం మాత్రమే పూర్తి అయ్యాయని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. ఈ హాస్పిటల్ ను నిర్మిస్తున్న కంపెనీకి ప్రభుత్వం నుంచి రూ. 100 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. బిల్లులు విడుదల చేయాలని గత నాలుగు నెలలుగా ఆ కంపెనీ ప్రతినిధులు ఫైనాన్స్ అధికారులను కోరుతున్నట్లు తెలిసింది. ఒకవేళ బిల్లులను వెంటనే రిలీజ్ చేసినా పనులు పూర్తికావడానికి మరో 2 నెలల టైమ్ పట్టే అవకాశం ఉందని సమాచారం.టిమ్స్‌కు నిధుల గండం.. బిల్లుల పెండింగ్‌తో లేట్‌గా హాస్పిటల్స్ పనులు
మిగతా హాస్పిటల్స్ దీ అదే పరిస్ధితి
అల్వాల్ లో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ పనులు 60 శాతం పూర్తి కాగా, ఎల్బీ నగర్ టిమ్స్ పనులు 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. అల్వాల్ టిమ్స్ ను 1200 బెడ్ల కెపాసిటీతో డీఈసీ కంపెనీ నిర్మిస్తోంది. ఈ కంపెనీకి రూ.40 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఎల్బీ నగర్ టిమ్స్ పనులను ఎల్ అండ్ టీ నిర్మిస్తోంది. వీటికి సైతం రూ.40 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ రెండు హాస్సిటల్స్ లో ఒకటి ఈ ఏడాది ఆగస్ట్ నాటికి, మరొకటి వచ్చే ఏడాది ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇపుడు బిల్స్ పెండింగ్ లో ఉండడంతో ఆ హాస్పిటళ్ల ప్రారంభం ఆలస్యం అవుతుందని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. వరంగల్ లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 95 శాతం పూర్తి కాగా ఈ ప్రాజెక్టుకు కూడా బిల్స్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.