కేసీఆర్‭ను గద్దె దించేవరకు ఇంటికి పోను: తీన్మార్ మల్లన్న

కేసీఆర్‭ను గద్దె దించేవరకు ఇంటికి పోను: తీన్మార్ మల్లన్న

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రాముని సాక్షిగా అబద్ధాలకోరు కేసీఆర్​తో యుద్ధం మొదలైందని, మోసకారిని గద్దె దింపేవరకు ఇంటికి పోయేది లేదని తీన్మార్​మల్లన్న అన్నారు. 7200 పాదయాత్రను భద్రాచలం నుంచి ప్రారంభించిన ఆయన జూనియర్​ కాలేజీ గ్రౌండ్​లో శనివారం సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాధలు తీరకపోగా రెట్టింపయ్యాయని, సబ్బండ వర్గాల ప్రజలను కేసీఆర్​మోసం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్​చేతిలో మొదట మోసపోయింది శ్రీరాములవారేనని పేర్కొన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పిన పెద్దమనిషి విద్యావ్యవస్థను సర్వనాశనం చేశాడని అన్నారు.

ఏ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పేదవానికి సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు. ప్రజలు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో ఎక్కడా ప్రైవేటు ఆసుపత్రులు, బడులు లేకుండా చేస్తానని, ఆఖరుకు కేసీఆర్​కు జ్వరం వచ్చినా ప్రభుత్వ వైద్యశాలకే వచ్చేలా చూస్తానని అన్నారు. చండ్రుగొండ మండలంలో అటవీ రేంజర్​ శ్రీనివాసరావు హత్యకు కేసీఆరే కారణమని, గిరిజనులు, అటవీ శాఖాధికారుల మధ్య గొడవ పెట్టి చలి కాగుతున్నాడని ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిచి ఫాం హౌస్​లో పడుకుంటూ కేసీఆర్ ​ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ జల్సా చేస్తున్నారని ఆరోపించారు. తమకు అధికారం ఇస్తే పనిచేయని ప్రజాప్రతినిధులను రీకాల్​ చేసే విధానాన్ని తీసుకొస్తామన్నారు. లిక్కర్​ పంచాయతీలో కవిత ఇరుక్కుందని, ఆమెను కాపాడేందుకు కేసీఆర్, కేటీఆర్​లు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సభ అనంతరం ఆదివాసీల గూడెంకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.