చేవెళ్లలో కంకర మీద పడి కడతేరిన బతుకులు.. 17 మందిని పొట్టన పెట్టుకున్న కంకర లోడు టిప్పర్

చేవెళ్లలో కంకర మీద పడి కడతేరిన బతుకులు.. 17 మందిని పొట్టన పెట్టుకున్న కంకర లోడు టిప్పర్

చేవెళ్ల: తెలంగాణలో సోమవారం ఉదయం ఘోరం జరిగింది. ఉదయాన్నే బస్సులో వెళుతున్న 17 మంది ప్రయాణికుల బతుకులు ఇలా తెల్లారిపోతాయని వాళ్లు కలలో కూడా అనుకోలేదు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ అతి వేగంగా దూసుకొచ్చి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును ఢీ కొట్టింది. బస్సు సగ భాగంలోకి టిప్పర్ దూసుకెళ్లడంతో టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది.

కంకరలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను స్థానికులు, పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే ఊపిరాడక కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం ఇంత మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది.