పెళ్లికి రెడీ అవుతున్నారా..? అయితే ఏం చేయాలంటే..

పెళ్లికి రెడీ అవుతున్నారా..? అయితే ఏం చేయాలంటే..

పెళ్లి చేసుకోవాలంటే జాబ్‌‌ ఉంటే చాలనుకుంటారు చాలామంది. మంచి శాలరీతో ఉద్యోగం రాగానే ఇక సెటిలైపోయాం… పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటారు. అయితే, జాబ్‌‌ వల్ల ఫైనాన్షియల్‌‌గా, కెరీర్‌‌లో‌‌ మాత్రమే సెటిలవుతారు. కానీ, అది పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన మెచ్యూరిటీని అందిస్తుందా? లేదా? చూసుకోవాలి. పెళ్లి తర్వాత జీవితం గురించి సరైన అవగాహనకు వచ్చాకే పెళ్లి చేసుకోవాలంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్‌‌.

మ్యారేజ్‌‌ లైఫ్‌‌ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్‌‌ ఉంటాయి. అంతకుముందు సోలోగా, జాలీగా గడిపినవాళ్లు చాలామంది ఆ రెస్పాన్సిబిలిటీస్‌‌ను పంచుకోలేరు. దీంతో ఇద్దరి మధ్యా సమస్యలు మొదలవుతాయి. వర్క్‌‌ డివిజన్‌‌, పేరెంటింగ్‌‌, ఫైనాన్షియల్‌‌ ఇష్యూస్‌‌… ఇలా కొన్ని కామన్‌‌ ప్రాబ్లమ్స్‌‌ భార్యాభర్తల మధ్య వస్తుంటాయి. అందుకే వీటి గురించి ముందుగానే సరైన అవగాహన ఉండటం ముఖ్యం అంటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్‌‌లు. పెళ్లికిముందు ప్రి– మారిటల్ కౌన్సెలింగ్‌‌కు హాజరయితే మంచిదని ఆమె చెప్తున్నారు. దీనిద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్‌‌ను ఎలా డీల్‌‌ చేయాలో ముందుగానే తెలుసుకోవచ్చు. పెళ్లి తర్వాత హ్యాపీ లైఫ్‌‌ లీడ్‌‌ చేయొచ్చు.

డివిజన్‌‌ ఆఫ్‌‌ లేబర్‌‌‌‌

ఇంట్లో పని విషయంలో కొందరు భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవే. ముఖ్యంగా ఇద్దరూ జాబ్‌‌ చేస్తుంటే, ఆ ప్రాబ్లమ్‌‌ మరింత ఎక్కువవుతుంది. ఇద్దరికీ ఇంటి పని చేసేందుకు టైమ్‌‌ ఉండదు. చాలామంది భర్తలు, ఇంట్లో పనంతా భార్యే చేయాలనుకుంటారు. ఇది కరెక్ట్‌‌ కాదు. ఇంట్లో పనిని ఇద్దరూ పంచుకోవాలి. సమానంగా చేయాలి అని కాకపోయినా, ఎవరి వీలునుబట్టి వాళ్లు ఇంకొకరికి ఇబ్బంది లేకుండా ఎక్కువ పని చేయాలి. కలిసి పనిచేస్తే అలసట రాదు. ఒకవేళ ఒకరు జాబ్‌‌ చేసి, ఒకరు హోమ్‌‌మేకర్‌‌‌‌గా డైలీ ఇంట్లో పని చేస్తుంటే, వీకెండ్స్‌‌, హాలీడేస్‌‌లో ఆ పనిని జాబ్‌‌ చేసేవాళ్లు పంచుకోవాలి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండాలి. ఆఫీస్‌‌లో ఎక్కువ పని ఉందనే సాకుతో, ఇంట్లో పనిని పూర్తిగా ఒక్కరిమీదే వేసెయ్యకూడదు.

డబ్బుతో..

భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనపరులైతే కొన్ని సమస్యలు.. ఒక్కరే సంపాదిస్తుంటే ఇంకొన్ని సమస్యలు. అందుకే ఈ విషయంలో కూడా పెళ్లికిముందే ఇద్దరూ ఒక ఒప్పందానికి రావాలి. ఎవరు సంపాదించినా ఇద్దరి కోసం.. కుటుంబం కోసం అనే విషయం గుర్తుంచుకోవాలి. అవసరాల్ని సమానంగా పంచుకోవాలి. ఎవరి పేరెంట్స్‌‌కు వాళ్ల సంపాదనలోంచే ఖర్చుపెట్టాలి అని కాకుండా, ఇద్దరి పేరెంట్స్‌‌ను సమానంగా చూడాలి. ఖర్చు విషయంలో కూడా ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థికపరమైన అంశాల్లో సరైన ప్లానింగ్‌‌తోపాటు, ఒక ఒప్పందం కూడా అవసరం.

పేరెంటింగ్‌‌

పిల్లలు పుట్టాక వాళ్ల పెంపకం విషయంలో కూడా చాలా గొడవలొస్తాయి. పిల్లల విషయంలో ఎవరు పూర్తి కేర్‌‌‌‌ తీసుకోవాలనేది సమస్య. దీనికి కారణం ఇద్దరికీ పేరెంటింగ్‌‌ విషయంలో ఒక ప్లాన్​ లేకపోవడమే. పిల్లల్ని పెంచేందుకు రెడీగా లేకుండానే పిల్లల్ని కంటారు. తీరా వాళ్లకు సంబంధించిన ఫీడింగ్‌‌, డ్రెస్‌‌లు మార్చడం, నిద్రపుచ్చడం వంటివి మాత్రం పట్టించుకోకుండా, ఒకరినొకరు తిట్టుకుంటారు. అందుకే పెళ్లయ్యాక పిల్లల్ని కనే విషయంలో ఇద్దరూ ఒక అవగాహనకు రావాలి. పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే, ఆ ప్రభావం వాళ్లపై చాలా ఎక్కువగా ఉంటుంది. పేరెంటింగ్‌‌ విషయంలో గొడవలు పడుతుంటే, పిల్లలు స్ట్రెస్‌‌కు గురవుతారు. అది వాళ్ల గ్రోత్‌‌పై ఎఫెక్ట్‌‌ చూపిస్తుంది. అందుకే పేరెంటింగ్‌‌ విషయంలో బాధ్యతగా ఉండాలి.

పర్సనాలిటీ సమస్యలు

ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే చాలు పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటారు చాలామంది. అయితే, అసలు సమస్య మొదలయ్యేది అభిప్రాయాలు కలవని విషయాల్లోనే. ఇద్దరి ఒపీనియన్స్‌‌ మ్యాచ్‌‌ అవ్వకపోతే ఏంటి? అని ఆలోచించరు. దీంతో పెళ్లి తర్వాత సమస్యలొస్తాయి. ఎదుటివాళ్లలో నచ్చని విషయాన్ని ఎలా తీసుకోగలరో ఆలోచించాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకుని సర్దుకుపోతారా? లేక ఎదుటి వాళ్లను మార్చేందుకు ప్రయత్నిస్తారా? ఇటు సర్దుకోలేక.. అటు మార్చలేక ఇబ్బంది పడతారా? ఇలా ఎదుటి వ్యక్తిలో నచ్చని విషయాన్ని  మీరు ఎలా తీసుకుంటారు అనేదాన్ని బట్టి మీ రిలేషన్‌‌ షిప్‌‌ ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని
గొడవల దాకా తెచ్చుకుంటే సమస్యే.

ప్రి–మారిటల్‌‌ కౌన్సెలింగ్‌‌ అవసరం

పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయి. పిల్లల పెంపకం, ఫైనాన్షియల్‌‌ ఇష్యూస్‌‌… ఇలా చాలా విషయాల్లో ఇద్దరిమధ్యా గొడవలు వస్తున్నాయి. పెళ్లి తర్వాతి లైఫ్‌‌ గురించి ఇద్దరికీ సరైన అవగాహన ఉండాలి. పెళ్లి తర్వాత ఎంత రెస్పాన్సిబిలిటీతో ఉండగలరో ఆలోచించాలి. అన్నింటికీ రెడీ అనుకున్నాకే పెళ్లి చేసుకోవాలి. పేరెంటింగ్‌‌కు సిద్ధమా? కాదో? తెలుసుకోవాలి. ముందుగానే అన్నింటికీ ఒక ప్లానింగ్‌‌ ఉంటే ఏ సమస్యా రాదు. అవసరమైతే పెళ్లికిముందు ప్రి–మారిటల్‌‌ కౌన్సెలింగ్‌‌ తీసుకోవడం చాలా అవసరం. – డా.రాధిక, సైకాలజిస్ట్.

For more news

మా అడవిని అమ్మనీయం

పర్యావరణ విధ్వంసంతోనే ప్రకృతి విపత్తులు

పుస్తకాల్లో భాష మారాలె

‌‌