మార్కులు తెలిస్తే జాబ్​ఈజీ

మార్కులు తెలిస్తే జాబ్​ఈజీ

ఆగస్టులో ఎస్​ఐ, కానిస్టేబుల్​​ ప్రిలిమ్స్​ జరగనున్నాయి. చాలా మంది అభ్యర్థులు ఏకకాలంలో రెండింటికీ ప్రిపేర్​ అవుతున్నారు. పక్కా ప్లాన్​తో ముందుకు సాగితే రెండింటీలోనూ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఎస్​ఐ, కానిస్టేబుల్​ సిలబస్​లో కామన్​ అంశాలేమిటి? ఏయే సబ్జెక్టుకు ఎంత వెయిటేజీ ఉంది? అందుకు  అనుగుణంగా ప్రిపరేషన్​ ప్లాన్​ గురించి తెలుసుకుందాం..‌‌‌

ఎస్‌‌ఐ, కానిస్టేబుల్‌‌ ప్రిలిమ్స్​ ఆగస్టులో నిర్వహించనున్నారు. 60 రోజుల సమయంలో ప్రిలిమ్స్​ క్వాలిఫై కావాలంటే 60 మార్కులు సాధించేలా స్మార్ట్‌‌వర్క్‌‌ చేయాలి. ప్రిలిమ్స్​ కేవలం అర్హత పరీక్ష కావడంతో క్వశ్చన్​ పేపర్​లో ప్రశ్నల స్థాయి​ కొంత కఠినంగా ఉండే అవకాశం ఉంది. సబ్జెక్టును కరెంట్​ టాపిక్స్​తో లింక్​ చేసుకొని చదివితే సమాధానాలు సులువుగా గుర్తించి ప్రిలిమ్స్​ గట్టెక్కవచ్చు. 

కామన్​ సబ్జెక్టులపై ఫోకస్​ 
తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ముందుగా ఎస్​ఐ, కానిస్టేబుల్​ ప్రిలిమ్స్​లో కామన్​గా ఉన్న సబ్జెక్టులపై ఫోకస్​ చేయాలి. నెగెటివ్​ మార్కులు ఉన్నందున కచ్చితంగా ఆన్సర్​ తెలిస్తేనే సమాధానం గుర్తించాలి. 80 నుంచి 90 ప్రశ్నలకు కరెక్ట్​గా సమాధానం గుర్తిస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది.

తెలంగాణ చరిత్ర - ఉద్యమం
తెలంగాణ ఉద్యమం, చరిత్రకు రెండు పరీక్షల్లోనూ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో 2016, 2018లో జరిగిన ఎగ్జామ్స్​లో 25 నుంచి 30 ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర నుంచి శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్​షాహీలు, అసఫ్​జాహీల కాలంలో యాస, భాష, సంస్కృతి, కళలు, వారసత్వం, తీసుకొచ్చిన సంస్కరణల మీద మార్కులు వచ్చే అవకాశం ఎక్కువ. ఉద్యమ పరిణామ క్రమంలో జేఏసీ చేపట్టిన కార్యక్రమాలు, పెద్ద మనుషుల ఒప్పందం, కమిటీలు, సంస్థలు, ఒప్పందాలు, వివిధ పార్టీల పాత్ర, ముఖ్యమైన తేదీలు గుర్తుపెట్టుకొని చదవాలి. ఉదాహరణకు పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది, అందులో ఎవరు పాల్గొన్నారు, ఒప్పందంలోని అంశాల మీద ప్రశ్నలు అడుగుతారు. 

ఇండియన్​ హిస్టరీ
ఇండియన్​ హిస్టరీలో ముఖ్యంగా ప్రాచీన, మధ్యయుగ చరిత్ర కాకుండా ఆధునిక చరిత్రకు సంబంధించిన జాతీయోద్యమంపై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ చేపట్టిన కార్యక్రమాలు, కుల, మత, గిరిజన ఉద్యమాలు, రౌండ్​ టేబుల్​ సమావేశాలు, గవర్నర్​ జనరల్స్​ మీద ఎక్కువగా ఫోకస్​ చేయాలి. ఇండియన్​ హిస్టరీ నుంచి 20 మార్కులు వచ్చే చాన్స్​ ఉంది. 

జాగ్రఫీ
తెలంగాణ పోలీస్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డ్‌‌ కొత్తగా ‘ప్రిన్సిపుల్స్‌‌ జాగ్రఫీ’ అనే అంశాన్ని చేర్చింది. ప్రాంతీయ భౌగోళికాంశాలే కాకుండా ప్రపంచ భూగోళ అంశాలైన అక్షాంశాలు, రేఖాంశాలు, సముద్రాలు, వాతావరణం, శిలావరణం అంశాలు చదవాలి. జనాభా లెక్కల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ.  ప్రపంచ, జాతీయ, ప్రాంతీయ భౌగోళిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ చదివితే ఎక్కువ స్కోర్​ చేయవచ్చు.  రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన నూతన అంశాలపై, రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక విధానాలపై దృష్టి సారించాలి. భౌగోళికంగా వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, దేశ, రాష్ట్ర పథకాలు, నీటి వనరులు తదితర అంశాలపై ఫోకస్​ చేస్తే  దాదాపు 15 నుంచి 20 మార్కులు రావచ్చు. 

అర్థమెటిక్‌‌ అండ్​ రీజనింగ్​
అర్థమెటిక్​ అండ్​ రీజనింగ్​ సబ్జెక్ట్ నుంచి ఎస్​ఐ ప్రిలిమ్స్​ పరీక్షలో 100 మార్కులు, కానిస్టేబుల్​లో 50 మార్కులు వస్తాయి.  అర్థమెటిక్‌‌లో నంబర్‌‌ సిస్టమ్, సింపుల్‌‌ అండ్​ కాంపౌండ్‌‌ ఇంట్రెస్ట్, రేషియో- ప్రపోర్షన్, సగటు, శాతాలు, లాభనష్టాలు, సమయం-–పని, సమయం-–దూరం, గడియారాలు, క్యాలెండర్, మెన్సురేషన్‌‌... తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్‌‌లో వెర్బల్, నాన్‌‌ వెర్బల్‌‌ ప్రశ్నలు ఉంటాయి. అనాలజీ, పోలికలు, భేదాలు, జడ్జ్‌‌మెంట్, డెసిషన్‌‌ మేకింగ్, విజువల్‌‌ మెమరీ... అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నాన్​ మ్యాథ్స్​ అభ్యర్థులు రీజనింగ్​ మీద ఎక్కువ ఫోకస్​ చేస్తే మంచి స్కోర్​ సాధించవచ్చు.

పోలీస్​ ఎగ్జామ్​ పేపర్​ వెయిటేజ్​
కరెంట్‌‌ అఫైర్స్‌‌ సిలబస్‌‌లో ఉన్న సబ్జెక్టుతో కరెంట్​ అఫైర్స్​ లింక్​ చేసి ప్రిపరేషన్​ కొనసాగించాలి. సైన్స్​ అండ్ టెక్నాలజీలో  భాగంగా కొత్తగా​ ప్రయోగించిన ఉపగ్రహాలు ఉదాహారణకు చంద్రయాన్, మంగళయాన్​ లాంటి ముఖ్యమైన ప్రయోగాలు గుర్తుంచుకోవాలి. లేటెస్ట్​ పర్యావరణ సదస్సులు అందులో చేసిన తీర్మానాలు, పాలిటీ నుంచి సుప్రీంకోర్టు తీర్పులు, కొత్తగా చేర్చిన ఆర్టికల్స్​, జమ్మూ కశ్మీర్​ కేంద్రపాలిత ప్రాంతంగా మారడం, డామన్​ డయ్యూ, దాద్రానగర్​ హవేలీ కలిపివేయడం లాంటి కరెంట్​ ఇష్యూస్​ మీద ఫోకస్​ చేయాలి. కరెంట్‌‌ ఎకానమీకి సంబంధించి బ్యాంకుల విలీనం, నీతిఆయోగ్​, ప్రణాళికలు లాంటి అంశాలపై అవగాహన ఉండాలి.  వైరస్‌‌లు, బాక్టీరియా, సుస్థిరాభివృద్ధి లాంటి విషయాలు, ప్రస్తుత ఉక్రెయిన్​ – రష్యా యుద్ధం, శ్రీలంక సంక్షోభం లాంటి అంశాల మీద ఫోకస్​ చేస్తూ ప్రిపరేషన్​ కొనసాగించాలి. అవార్డులు, స్పోర్ట్స్​ ఈవెంట్స్, ఐక్యరాజ్యసమితి, నాటో, బ్రిక్స్​, సార్క్​ లాంటి అంతర్జాతీయ సంస్థల గురించి అవగాహన ఉండాలి. కరెంట్ అఫైర్స్​ లో 20 నుంచి 30 ప్రశ్నలు అడుగుతున్నారు.