చంద్రప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు... నవనీత కృష్ణుడి అవతారంలో స్వామి అభయం

చంద్రప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు... నవనీత కృష్ణుడి అవతారంలో స్వామి అభయం

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా  ఆదివారం సాయంత్రం ఏడవ రోజున  ( సెప్టెంబర్ 24)   శ్రీ మలయప్పస్వామివారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.  బ్రహ్మోత్సవాల్లో  సెప్టెంబర్ 24న  ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. 

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు  ఆదివారం ( సెప్టెంబర్ 24)  రాత్రి చంద్రప్రభ వాహ‌నంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప భక్తులకు దర్శనమిచ్చారు. నవనీత కృష్ణుడి అవతారంలో  చంద్రవాహనంపై  ఆసీనులై విహరిస్తున్న స్వామి వారిని దర్శించునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించిన స్వామి వారు సాయంత్రం చంద్ర ప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. వాహనం ముందు భక్త జన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

చంద్రుడు చల్లదానానికి, మానసిక ఉల్లాసానికి కారకుడు. వేంకటాద్రిపై కొలువున్న వేంకటేశ్వరుడికి సూర్యచంద్రులు ఇరువురు రెండు నేత్రాలు. సూర్యుడు దివాకరుడు, చంద్రుడు నిశాకరుడు సూర్యకాంతితోనే చంద్రుడు ప్రకాశిస్తాడు. కనుక పగలు సూర్యప్రభ వాహనం జరిగిన తరువాత రాత్రి చంద్ర ప్రభవాహనం వైభవంగా జరిగింది. చంద్రుడు అమృత కిరణాలు కలిగినవాడు, వేంకటేశ్వరుడు నవనీత కృష్ణుడి అలంకారంలో  చంద్రప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. 

చంద్రుడు వల్ల సంతోషం కలుగుతుంది, చంద్రప్రభ వాహనంపై విహరిస్తున్న వేంకటేశ్వరుడిని దర్శన ద్వారా భక్తులకు మానసిర ఉల్లాసం చేకూరుతుంది. తనను శరణు కోరిన వారి సుఖసంతోషాలకు తానే కారణమని చంద్రప్రభ వాహనం ద్వారా స్వామివారు భక్తులకు సందేశమిచ్చారు.శివుడికి చంద్రుడు శిరోభూషణమైతే శ్రీహరికి చంద్రప్రభ వాహనంగా భక్తుల ముందుకు రావడం విశేషం. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.