తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

తిరుపతి: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన గవర్నర్ దత్తాత్రేయ దంపతులకు టీటీడీ దేవస్థానం ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు, వేద పండితులు స్వాగతం పలికారు. సతీసమేతంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దత్తాత్రేయ. దర్శనం అనంతరం గవర్నర్ దత్తాత్రేయ దంపతులకు శ్రీవారి వేద ఆశీర్వచనాలు, తీర్ధ ప్రసాదాలతోపాటు, శ్రీవారి జ్ఞాపిక, టీటీడీ ముద్రించిన క్యాలెండర్లను అందజేశారు. 

తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నా
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ వెల్లడించారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం చాలా గొప్పదని గుర్తు చేశారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి, తిరుమలలో భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ప్రతిరోజు లక్షల మంది దర్శించుకోవడం చాలా విశేషమైనదని పేర్కొన్నారు.  టీటీడీ చేస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. 

సంస్కార కేంద్రాలు ప్రారంభించాలి

బడుగు, బలహీన వర్గాల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి టీటీడీ దేవస్థానం వారు సంస్కార కేంద్రాలను ప్రారంభిస్తే  బాగుంటుందని గవర్నర్ దత్తాత్రేయ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించాలని సూచించారు. చిన్న వయసులోనే పిల్లలకు ఆధ్యాత్మిక మార్గాన్ని అలవాటు చేస్తే.. పిల్లల్లో నైతిక విలువలు పెరుగుతాయని.. తద్వారా సమాజం శాంతి వెల్లి విరుస్తుందని అభిప్రాయపడ్డారు.