తిరుమల ఘాట్ రోడ్డు లోయలో దూకిన భక్తుడు : ప్రాణాలకు తెగించి కాపాడిన సిబ్బంది

తిరుమల ఘాట్ రోడ్డు లోయలో దూకిన భక్తుడు : ప్రాణాలకు తెగించి కాపాడిన సిబ్బంది

తిరుమల కొండలు అంటే ఎంత పవిత్రం.. ప్రతి అడుగు అక్కడ గోవిందనామంతో ప్రతిధ్వనిస్తోంది.. ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్కసారి గోవిందుడిని దర్శించుకుంటే చాలు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. అలాంటి కొండపై.. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో.. మోకాళ్ళ పర్వతం సమీపంలోని అవ్వాచారి కోన దగ్గర ఓ భక్తుడు కొండ పైనుంచి దూకేశాడు. అవ్వాచారి కోన దగ్గర నుంచి లోయలోకి దూకేశాడు ఓ భక్తుడు. 2025, జూలై 16వ తేదీ ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వ్యక్తి లోయలోకి దూకటాన్ని గమనించిన భక్తులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. 

విషయం తెలిసిన వెంటనే స్పాట్ కు చేరకున్న తిరుమల కొండ రెస్క్యూ టీం.. ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసింది. లోయ చాలా చాలా లోతు ఉండటం.. దట్టంగా ఉండటంతో తిరుమల కొండ రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి మరీ ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. పెద్ద తాళ్ల సాయంతో లోయలోకి వెళ్లిన సిబ్బంది.. ఆ తర్వాత నిచ్చెనలు వేసి లోయలోకి దిగారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత.. దూకిన వ్యక్తి ఆచూకీ దొరికింది.

ఆ వ్యక్తి నడవలేని స్థితిలో ఉండటంతో.. అతనికి తాళ్లు కట్టి.. నిచ్చెన ద్వారా లోయ లోనుంచి బయటకు తీసుకొచ్చారు సిబ్బంది. అతన్ని తిరుమల అశ్వని ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత వివరాలు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడని చెబుతున్నారు తిరుమల పోలీసులు. తన పేరు రాయుడు అని.. ఆళ్లగడ్డ అని ఒకసారి.. తాడిపత్రి అని ఒకసారి చెబుతున్నాడని.. చికిత్స తర్వాత విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు తిరుమల పోలీసులు. 

ప్రాణాలకు తెగించి.. ఎంతో సాహసం చేసి మరీ లోయలో పడిన వ్యక్తిని కాపాడిన సిబ్బందికి భక్తులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.