తిరుమల తిరుపతిలో చిరుత పులుల సంచారం పెరిగిపోతుంది. నిత్యం ప్రజావాసాల్లోకి వస్తున్న చిరుత పులులు వీధి కుక్కలు, పశువులు, ఇతర జంతువులపై దాడులు చేస్తున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమరాల్లో రికార్డు కావడంతో షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. మరోసారి తిరుపతిలో చిరుత సంచారం కలకలం గా మారింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్‌వీయూ) క్యాంపస్‌లో చిరుతపులి ప్రత్యక్షమవడంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బుధవారం ( నవంబర్ 26) క్యాంపస్‌లోని ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న నాటుకోళ్ల షెడ్‌పై రాత్రి సమయంలో చిరుత దాడి చేసేందుకు చిరుత ప్రయత్నిస్తున్నదృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి.
ఆ తరువాత చిరుత నివాసాల ప్రాంతంతో కొద్దిసేపు తిరిగి తరువాత అటవీ ప్రాంతంవైపు వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ బృందాలు చిరుత జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టాయి. తిరుమలలో గత కొంతకాలంగా చిరుతల సంచారం పెరుగుతుండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
