బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ- ....భక్తులకు టీటీడీ కీలక సూచనలు

 బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ- ....భక్తులకు టీటీడీ కీలక సూచనలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇప్పటికే పెద్దశేష వాహనం, చిన్నశేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యాల పందిరి వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. శుక్రవారం నాడు  ( సెప్టెంబర్ 22) బ్రహ్మోత్సవాలలోని ముఖ్యగట్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. శుక్రవారం రాత్రి 7 నుంచి  అర్దరాత్రి 2 గంటల వరకు  స్వామి వారి గరుడ సేవను నిర్వహిస్తారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే అకాశం ఉండటంతో.. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవిందనిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించనున్నారు. 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండే అవ‌కాశ‌ముంది.    గ‌రుడ‌సేవ ద‌ర్శనం కోసం బయట వేచి ఉండే భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి..  భద్రతా విభాగం నిబంధనలు పాటించాల‌ని తెలిపారు. 

గరుడ వాహన సేవ రోజున  1200 మంది పోలీసులతో అదనపు భద్రత క‌ల్పించనున్నారు  బ్రహ్మోత్సవాల‌కు దాదాపు 1130 మంది టీటీడీ నిఘా,  భద్రతా సిబ్బందితోపాటు 3,600 మంది పోలీసులతో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు.  మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2 వేల 770 సిసి కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని  కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి  పర్యవేక్షిస్తారు. . ఆర్‌టీసీ బస్సుల్లో 3 వేల ట్రిప్పుల ద్వారా దాదాపు 3 లక్షల మందిని తరలించేందుకు చర్యలు చేప‌ట్టారు. భ‌క్తుల‌కు వైద్యసేవ‌ల కోసం మొబైల్ క్లినిక్‌లు, 7 అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడిక‌ల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. గరుడసేవను వీక్షించే భ‌క్తుల కోసం 2 లక్షల 50 వేల  మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 524 తాగునీటి డ్రమ్ములను ఏర్పాటుచేశారు.  గరుడసేవ నాడు వాహనసేవను తిలకించేందుకు 20 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

స్వామి వారి వాహన సేవల్లో అత్యంత కీలకమైనది గరుడ వాహన సేవ గా భక్తులు భావిస్తారు. ఈ వాహన సేవల్లో పాల్గొనే భక్తులు శ్రీవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతారని, సకల పాపాలు తొలగిపోతాయని. జ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకం. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైంది గరుడవాహనం. గరుడ వాహనంపై ఊరేగే స్వామి వారిని దర్శించుకుంటే.. ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.

సృష్టి కర్త బ్రహ్మ మొదలు పెట్టిన బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడు. కనుక గరుడ వాహన సేవకు విశిష్ట స్థానం ఉంది. గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి విలకట్టలేనని ఆభరణాలైన.. మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను అలంకరిస్తారు. స్వామి ప్రసన్న వదనుడిగా శ్రీదేవి, భూదేవి లతో కలిసి గరుత్మంతుడిపై ఊరేగుతాడు. కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. దీంతో గరుడ వాహన సేవ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది టీడీడీ.