తిరుమలలో వరాహస్వామి ( ఆగస్టు 25) జయంతి ఉత్సవాలు.. విష్ణుమూర్తి మూడవ అవతారం ఇదే..!

తిరుమలలో  వరాహస్వామి ( ఆగస్టు 25) జయంతి ఉత్సవాలు.. విష్ణుమూర్తి మూడవ అవతారం ఇదే..!

కలియుగ దైవం.. శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ నెల  25 వతేదీన శ్రీ భూ వరాహస్వామి వారి ఆలయంలో.. వరాహజయంతి కార్యక్రమం వైభవోపేతంగా  జరిపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.  వామన జయంతి పూజల్లో భాగంగా  ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేస్తారు. ఆ త‌రువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు.

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ...  తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తారు. భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామివారిని,... ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారంగా కొనసాగుతుంది. స్థితి కారుడైన శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

వరాహ జయంతి అనేది శ్రీ మహావిష్ణువు  దశావతారాలలో మూడవదైన వరాహ అవతారానికి అంకితం చేయబడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.   శ్రీ వరాహ భగవానుడు భూమాతను హిరణ్యాక్షుడు అనే భయంకరమైన రాక్షసుడి నుండి రక్షించి, ఆమెను సముద్ర గర్భం నుండి తిరిగి తీసుకువచ్చాడు. ఈ అవతారం ధర్మాన్ని పునఃస్థాపించడానికి మరియు పాపాలను నిర్మూలించడానికి ఎంతో ప్రాముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకే, ఈ పవిత్రమైన రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పురాణాల ప్రకారం, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన దుష్టత్వంతో లోకాలను పీడిస్తూ, భూమిని చాప చుట్టినట్లుగా సముద్రంలో దాచాడు. దీంతో దేవతలు ...  మునులు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా, ఆయన తన మూడవ అవతారమైన వరాహ రూపాన్ని ధరించాడు. శక్తివంతమైన పంది ఆకారంలో ఉన్న వరాహ స్వామి...  సముద్రంలోకి చొచ్చుకుపోయి తన బలమైన కోరలతో భూమిని పైకి ఎత్తి, హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఈ విధంగా, వరాహ స్వామి భూమిని ...  ధర్మాన్ని కాపాడాడు. ఈ కథ విష్ణు పురాణం... భాగవత పురాణం ... అగ్ని పురాణం వంటి అనేక ప్రాచీన గ్రంథాలలో వివరంగా వర్ణించబడింది.