తిర్యాణి, వెలుగు: ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని.. కనీసం దేవుడైనా కరుణించాలని ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల వాసులు గణపయ్యను వేడుకున్నారు. రోడ్లు వేయాలని వినతిపత్రం ఇచ్చారు. తిర్యాణి మండల అభివృద్ధి జేఏసీ ఆధ్వర్యంలో కుమ్రంభీం చౌరస్తాలోని వినాయకుడికి సోమవారం వినతిపత్రం సమర్పించారు.
మండలంలోని మారుమూల గ్రామాలకు ఇప్పటివరకు సరైన రోడ్లు లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు, నేతలకు చెప్పినా పట్టించుకోవడం లేదని, అందుకే గణనాథుడినే ఆశ్రయించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. కుల సంఘాల జేఏసీ నాయకులు వెడ్మ భగవంతరావు, వెంకటేశ్, వల్క శ్రీధర్, రాయి సిడం జంగు తదితరులు ఉన్నారు.
