బనకచర్లపై ముందుకెళ్తే ఊరుకోం.. కేంద్రం జోక్యం చేసుకొని ప్రాజెక్ట్ ఆపాల్సిందే: MLC కోదండరాం

బనకచర్లపై ముందుకెళ్తే ఊరుకోం.. కేంద్రం జోక్యం చేసుకొని ప్రాజెక్ట్ ఆపాల్సిందే: MLC కోదండరాం
  • టీజేఎస్ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో పోరాడుతం
  • కేంద్రం, ఏపీ ప్రభుత్వం కలిసే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయని ఫైర్
  • కేంద్రం జోక్యం చేసుకొని బనకచర్లను ఆపాల్సిందే: దొంతుల లక్ష్మీనారాయణ
  • కేసీఆర్ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని మండిపాటు
  • తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో బనకచర్లపై సెమినార్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు అన్యాయం చేసే బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు ముందుకెళ్తే చూస్తూ ఊరుకోమని తెలంగాణ జన సమితి (టీజేఎస్) చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ జన సమితి తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తుందని ప్రకటించారు. ‘గోదావరి జలాలు.. బనకచర్ల ప్రాజెక్టు.. తెలంగాణ కోణం’ అనే అంశంపై శుక్రవారం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీసులో సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్ దొంతుల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. కేంద్రం, ఏపీ సర్కారు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయని, దీన్ని తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జల దోపిడీ నుంచి తెలంగాణ ఇప్పటికీ విముక్తి పొందలేదన్నారు. పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను పెన్నా బేసిన్ వైపు మళ్లించేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర హక్కులకు హానికరమన్నారు. విభజన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ కేంద్ర ప్రభుత్వం బనకచర్లకు అనుమతులిచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు. 

బీజేపీ లీడర్లు ఏం చేస్తున్నట్టు..? 

గోదావరి నది మిగులు జలాలు, వరద జలాల పేరుతో తెలంగాణ నికర జలాలను కొల్లగొట్టడం కోసమే ఏపీ బనక చర్ల ప్రాజెక్టును రూపొందించిందని రిటైర్డ్​ఇంజినీర్ దొంతుల లక్ష్మీనారాయణ అన్నారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్ర నాయకత్వం కృష్ణా, గోదావరి నదులపై అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణకు రావాల్సిన నీళ్లను దోచుకెళ్లిందని, మళ్లీ ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. 300 టీఎంసీల గోదావరి నీళ్లను కొలగొట్టడానికే బనకచర్లను చేపడుతున్నారన్నారు. గోదావరి తెలంగాణలో 79% ప్రవహిస్తుండగా, ఆంధ్రాలో 21 % మాత్రమే ప్రవహిస్తోందని తెలిపారు. 

బనకచర్లపై ఏపీని కేంద్రం ప్రశ్నించకపోవడం, అడ్డుకోకపోవడం చూస్తే కేంద్ర ప్రభుత్వ ధోరణి అర్థమవుతోందన్నారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. బీఆర్ ఎస్ నాయకులు బనకచర్ల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని ప్రకటించిన వ్యక్తి కేసీఆర్ ​అని అన్నారు. తెలంగాణ వ్యతిరేకి అయిన జగన్​కు ప్రగతి భవన్​లో ఎర్ర తివాచీ పరిచి నదుల సంధానం పేరుతో కొత్త నాటకానికి తెర లేపారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్టు నిలిపివేయాలని డిమాండ్ ​చేశారు.