- నిరుద్యోగం, పోడు రైతులు, ఏపీ అక్రమ ప్రాజెక్టులు,
- పెట్రో ధరల పెంపుపై ఆందోళనలు
- టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జన సమితి (టీజేఎస్)ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం అంతా వట్టి పుకార్లేనని టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. గతంలోనూ బీజేపీకి దగ్గరవుతున్నారంటూ ప్రచారం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో విలీనం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో టీజేఎస్ తరఫున క్యాండిడేట్ ను నిలబెడతామని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీజేఎస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారని, ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇవన్నీ సర్కార్ హత్యలేనన్నారు. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. టీజేఎస్ యాక్టివిటీస్ జిల్లా కేంద్రాల వరకే పరిమితమయ్యాయని, ఇకపై అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలని తీర్మానం చేశామన్నారు. నిరుద్యోగం, పోడు రైతుల సమస్య, ఏపీ ప్రభుత్వ అక్రమ ప్రాజెక్టులు, కేసీఆర్ రహస్య ఒప్పందాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఆందోళనలు నిర్వహించాలని పార్టీ క్యాడర్‌కు కోదండరాం పిలుపునిచ్చారు. ఆగస్టు చివరిలో పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో టీజేఎస్ నేతలు బైరి రమేష్, ఆశప్ప, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
టీజేఎస్‌కు శ్రీశైల్ రెడ్డి రాజీనామా
టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చైర్మన్‌గా పని చేస్తున్న పంజుగుల శ్రీశైల్ రెడ్డి ఆదివారం తన పదవులకు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్ కోదండరామ్‌కు లెటర్ అందజేశారు. తెలంగాణ సమాజం కోసం రాజకీయంగా చేయాల్సినంత చేయలేకపోతున్నామని, టీజేఎస్ ఆ దిశగా పోవడం లేదన్నారు. పార్టీకి ఉద్యమ పంథానే ఉంది తప్పా, రాజకీయ ఆలోచన లేదన్నారు.
