వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ నేత అరెస్ట్

 వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ నేత అరెస్ట్

రేష‌న్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్ ను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు.  రేషన్‌ పంపిణీ కుంభకోణంపై  జనవరి 5న షాజహాన్‌ ఇంటికి తనిఖీకి వెళ్లిన ED బృందంపై ఆయన అనుచరులు వెయ్యి మంది దాడికి పాల్పడ్డారు. అదే సమయంలో షాజహాన్ తప్పించుకుపోయాడు. దాదాపు 50 రోజులుగా పరారీలో ఉన్నాడు.  సందేశ్‌ఖాలీలో మ‌హిళ‌ల‌పై వేధింపులు, భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. షేక్ షాజ‌హాన్‌ ను ఆరేళ్లపాటు టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వెస్ట్ బెంగాల్ మినాఖా గ్రామంలో ఓ ఇంట్లో ఉంటున్న షాజ‌హాన్‌ను గురువారం (ఫిబ్రవరి29)న అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. అనంతరం బసిర్హత్ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 10రోజులు రిమాండ్ విధించింది.

తప్పించుకు తిరుగుతున్న షాజాహాన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సందేశ్‌ఖాలీ ప్రాంత ప్రజలు హింసాత్మక నిరసనలు చేపట్టారు. ఈడీ, సీబీసై సైతం ఆయనను అరెస్టు చేయొచ్చని కోల్‌కత్తా హైకోర్టు బుధవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. టీఎంసీ పార్టీ నేత డెరిక్ ఒబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నుంచి షేక్ షాజ‌హాన్‌ను ఆరేళ్లు స‌స్పెండ్ చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ తీరును ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. బ్రిజ్ భూష‌ణ్ లాంటి నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీఎంసీ నేత ఒబ్రెయిన్ డిమాండ్ చేశారు.