నవంబరు 2న లోక్‌సభ కమిటీ ముందుకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

నవంబరు 2న లోక్‌సభ కమిటీ ముందుకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నైతిక విలువల కమిటీ ముందు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. కమిటీ ఆదేశించినట్లుగానే నవంబరు 2వ తేదీన విచారణకు రానున్నట్లు చెప్పారు. అయితే.. నేరారోపణలను విచారించేందుకు లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ సరైన వేదికేనా? అని మహువా ప్రశ్నించారు. పార్లమెంటరీ కమిటీలకు నేరారోపణలను విచారించే అధికార పరిధి లేదన్నారు. ఈలాంటి కేసుల్లో దర్యాప్తు సంస్థలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీని కూడా విచారణకు పిలవాలని ఎంపీ మహువా మొయిత్రా విజ్ఞప్తి చేశారు.

అదానీ గ్రూప్‌ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునేలా ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి ఎంపీ మహువా రూ.2 కోట్లతోపాటు ఖరీదైన బహుమతులు పొందారని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ స్పీకర్‌కు ఆయన లేఖ రాశారు. ఈ వ్యవహారం లోక్‌సభ నైతిక విలువల కమిటీ వద్దకు చేరింది. ముందుగా అక్టోబరు 31నే విచారణకు హాజరు కావాలని ఎంపీ మహువా మొయిత్రాను కమిటీ ఆదేశించింది. అయితే.. ముందుగా షెడ్యూల్‌ చేసిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, నవంబరు 5వ తేదీ తర్వాత తేదీని ఖరారు చేయాలని ఎంపీ మహువా అభ్యర్థించారు. అయితే.. మహువా విజ్ఞప్తిని తోసిపుచ్చిన కమిటీ.. నవంబరు 2వ తేదీన తమ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

తాను నవంబర్ 2న ఉదయం 11 గంటలకు కమిటీ ముందు హాజరవుతానని ఎంపీ మొయిత్రా తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో నిషికాంత్‌ దూబే, న్యాయవాది జై అనంత్‌ దేహాద్రాయ్‌లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలు ఇచ్చారు.

తాను దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్న 18 వార్తాసంస్థలు, ఆన్‌లైన్‌ వేదికల పేర్లను తొలగించే అవకాశం ఇవ్వాలని మహువా చేసిన విజ్ఞప్తికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. కేవలం నిషికాంత్‌ దూబే, జై అనంత్‌ దేహద్రాయ్‌లపైనే ఈ కేసులో పోరాడనున్నట్లు మహువా తరఫు న్యాయవాది తెలిపారు. డిసెంబరులో ఈ పిటిషన్‌ విచారణ జరగనుంది.