హిందువుల ఓట్లు చీల్చడానికే తృణమూల్ పోటీ

హిందువుల ఓట్లు చీల్చడానికే తృణమూల్ పోటీ
  • మమతా బెనర్జీ పార్టీపై ప్రధాని మోడీ ఫైర్
  • కాన్పూర్, జలంధర్​లలో ఎన్నికల ప్రచారం

అక్బర్​పూర్, కాన్పూర్, జలంధర్: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఓట్లను చీల్చడానికే తృణమూల్​ కాంగ్రెస్​ అక్కడ పోటీ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆ పార్టీ నేతలే ఈ విషయాన్ని పబ్లిక్​గా చెప్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని, మాట్లాడారు. హిందువుల ఓట్లను చీల్చడం కోసమే తృణమూల్​ ప్రయత్నిస్తోందని, ఆ విషయాన్ని  పార్టీ లీడర్​మహువా మోయిత్రా మీడియాతో చెప్పారని ఆరోపించారు. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మోయిత్రా ఈ కామెంట్స్ చేశారన్నారు. గోవాలో మహారాష్ట్రవాదీ గోమంత్రక్​ పార్టీ(ఎంజీపీ)తో కలిసి పోటీ చేయడానికి ముఖ్య కారణం ఇదేనన్నారు. ‘హిందూ ఓట్లను చీల్చడమే సెక్యులరిజమా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఓట్లు చీల్చాలన్న ప్రయత్నం సరే, మరి మీరు ఎవరిని ఓట్లడగబోతున్నారు?’ అని టీఎంసీని మోడీ ప్రశ్నించారు. ఇలాంటి వివక్షను చూపించే లీడర్లను, పార్టీలను బొంద పెట్టాలని.. ఇప్పుడు గోవా ప్రజలకు ఆ అవకాశం వచ్చిందని మోడీ చెప్పారు. యూపీలో గుండాలు, క్రిమినల్స్, అల్లరి మూకల గుండెల్లో యోగి ప్రభుత్వం భయాన్ని నింపిందని మోడీ మెచ్చుకున్నారు. రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలలో కాన్ఫిడెన్స్​ నింపిందని, అందుకే వాళ్లు తమ సీఎంగా మళ్లీ యోగీయే కావాలని కోరుకుంటున్నరన్నారు. ట్రిపుల్​ తలాఖ్​కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టంతో రాష్ట్రంలోని వేలాది మంది ముస్లిం మహిళలకు భరోసా లభించిందని అన్నారు.

వాళ్ల యువరాజు కోసం అప్పట్లో నన్ను ఆపిన్రు..

2014 జనరల్​ఎలక్షన్స్​ ప్రచారంలో భాగం గా పంజాబ్​కు వచ్చిన తనను అప్పటి కాంగ్రెస్​ సర్కారు ఆపేసిందని మోడీ చెప్పా రు. జలంధర్​ ర్యాలీలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. అమృత్​సర్​లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హిమాచల్​ ప్రదేశ్​కు బయలుదేరుతుంటే తనను ఆపారన్నారు. వాళ్ల యువరాజు(రాహుల్​ గాంధీ) కూడా అమృత్​సర్​లోనే ఉన్నాడని, ఆయన కోసం తన హెలీక్యాప్టర్​ను అడ్డుకున్నారని మోడీ తెలిపారు. కాగా, హోషియార్​పూర్​లో సోమవారం కాంగ్రెస్​ ప్రచారానికి రాహుల్​ హాజరైండు. సీఎం చన్నీ కూడా వెళ్లాల్సి ఉంది. ప్రధాని టూర్​ కారణంగా సీఎం హెలీక్యాప్టర్​కు అధికారులు అనుమతించలేదు. ప్రధాని టూర్​ పేరుతో తన ప్రయాణాన్ని అధికారులు అడ్డుకున్నరని చన్నీ విమర్శించారు. 

మరిన్ని వార్తల కోసం..

కోట్లు వస్తాయనుకుంటే పైసా ఇయ్యలే

మేడారం బైలెల్లిన పెండ్లికొడుకు

ఏపీకి షాకిచ్చిన ఎన్జీటీ