51% ఫిట్ మెంట్ సిఫార్సు చేయండి : టీఎన్జీవో నేతలు

51% ఫిట్ మెంట్ సిఫార్సు చేయండి : టీఎన్జీవో నేతలు
  • పీఆర్సీ చైర్మన్​ను కోరిన టీఎన్జీవో నేతలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు జులై 1, 2023 నుంచి అమలయ్యేలా 51 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ ను టీఎన్జీవో నేతలు కోరారు. సోమవారం జీఎస్ మారం జగదీశ్వర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్, సత్యనారాయణ గౌడ్, ట్రెజరర్ శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు  బీఆర్కే భవన్ లో చైర్మన్ ను కలిసి 2వ పీఆర్సీకి యూనియన్ తరఫున ప్రతిపాదనలను అందజేశారు.

ఉద్యోగులకు కనీస వేతనం రూ.35 వేలు, గరిష్ట వేతనం రూ.2,99,100 ఇవ్వాలని కోరారు.  సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.  కనీస పెన్షన్ మొత్తాన్ని రూ. 9,500 నుంచి రూ.17,500 కు పెంచాలని, రిటైర్మెంట్ గ్రాట్యుటీ 16 లక్షల నుంచి 24 లక్షల పెంచాలని, ఉద్యోగులు, పెన్షనర్లు చనిపోతే ఇపుడిస్తున్న అంత్యక్రియల ఖర్చును రూ.30 వేల ను రూ.75వేలకు పెంచాలన్నారు. ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోపే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నేతలు చైర్మన్ ను కోరారు.

40 % పిట్ మెంట్ ఇవ్వాలన్న టీజీవో

ఉద్యోగులకు 40 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ సిఫార్సు చేయాలని, కనీస వేతనం రూ.32 వేలు ఇవ్వాలని టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, సత్యనారాయణ కోరారు. సోమవారం వారు పీఆర్సీ చైర్మన్ శివశంకర్ ను కలిసి టీజీవో తరఫున ప్రతిపాదనలు అందజేశారు. ఉద్యోగులు అదనపు బాధ్యతల్లో పనిచేసినపుడు  3 నెలల టైమ్ వరకు ఇచ్చే అలవెన్స్ ను ఎత్తివేసి, పనిచేసినంత వరకు ఇవ్వాలని నేతలు కోరారు. ఉద్యోగుల చందాతో ఈహెచ్ ఎస్ స్కీమ్ ను అమలు చేసి స్టేట్ లో ఏ హాస్పిటల్ లో అయినా ఫ్రీ ట్రీట్ మెంట్ ఇచ్చేలా సిఫార్సు చేయాలన్నారు. 

మంచి ఫిట్​మెంట్​తో పీఆర్సీ ఇయ్యాలె

టీచర్లకు, ఉద్యోగులకు మంచి ఫిట్ మెంట్ తో పీఆర్సీ ఇయ్యాలని టీచర్ల సంఘాలు పీఆర్సీ కమిటీని కోరాయి. సోమవారం కమిటీ చైర్మన్ శివశంకర్​ను  పీఆర్టీయూ, ఎస్టీయూ, టీఆర్​టీఎఫ్, యూటీఎఫ్, పీఆర్టీయూటీ, హెడ్మాస్టర్ల సంఘం, సీపీఎస్​ఈయూ, ఆర్​యూపీపీ, బీటీఏ, ఎస్​జీటీ ఫోరం, టీపీటీయూ, టీటీయూ తదితర సంఘాలు వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశాయి. కనీస వేతనం రూ.35 వేలు నిర్ణయిస్తూ 50% ఫిట్ మెంట్ తో పీఆర్సీ ఇవ్వాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు కోరారు. గ్రాట్యూటీ రూ.24 లక్షలకు పెంచాలని, రెండేండ్లు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పర్వత్ రెడ్డి, సదానందంగౌడ్ విజ్ఞప్తి చేశారు.