మమ్మల్ని సంప్రదించకుండానే సమ్మెలోకి దిగారు: TNGO, TGO

మమ్మల్ని సంప్రదించకుండానే సమ్మెలోకి దిగారు: TNGO, TGO

ఆర్టీసీ కార్మిక నాయకులు రాజకీయ పార్టీల ట్రాప్ లో పడద్దని, సమ్మెను రాజకీయ పార్టీల చేతిలో పెడితే వారికే నష్టమని TNGO అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను ఉద్ధృతం చేస్తుండడంతో TNGO, TGO సంఘాలు ప్రెస్ మీట్ పెట్టాయి. తమను సంప్రదించకుండానే ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పోయిందని, ఉద్యోగుల మధ్య రాజకీయ పార్టీలు చిచ్చు పెడుతున్నాయని ఆయన  అన్నారు.

ఆర్టీసీ కార్మికులు తమ అభిప్రాయాలను తీసుకోకుండానే సమ్మెలోకి వెళ్లారని, సమ్మెకు ముందు తమను ఎందుకు సంప్రదించలేదని ఆయన అన్నారు. వారి కోసం 2 గంటలు వేచి చూసామని, వేరే కారణాల వల్ల రాలేక పోతున్నామని చెప్పినట్టు ఆయన తెలిపారు. తమ సమస్యల సాధన కోసం సీఎం ను కలిస్తే ఆ విషయాన్ని మరో రకంగా వక్రీకరించడం బాధాకరమన్నారు.

ఆర్టీసీ నాయకులు సొంతంగానే ముందుకు వెళ్లాలని, రాజకీయ పార్టీల నుంచి జాగ్రత్త పడాలని రవీందర్ రెడ్డి సూచించారు. రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. ఆర్టీసీ కార్మిక నాయకులు తమను కలిస్తే తమ వైఖరి తెలిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యం గా ఉండాలన్నారు. తమపై దృష్ప్రచారాలను ఆపాలన్నారు.

టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. ఆర్టీసీ నాయకులు తెలంగాణ ఉద్యమం తరువాత జరిగిన ఏ సమావేశంలో పాల్గొనలేదన్నారు. ఇప్పుడు సమ్మె కు వెళ్లెప్పుడు కూడా తమని సంప్రదించలేదన్నారు. తమ యూనియన్ లో ఆర్టీసీ వాళ్ళు లేరని, ఉద్యోగ సంఘాల పై దృష్ప్రచారాలను ఆపాలని కోరారు. సీఎం పిలిస్తే వెళ్లడం నేరం కాదని, అది తమ బాధ్యత అని ఆమె అన్నారు.