ఫిట్ మెంట్​ 43%  కంటే ఎక్కువియ్యాలె

ఫిట్ మెంట్​ 43%  కంటే ఎక్కువియ్యాలె

తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్ విఠల్ డిమాండ్​
సంఘం అధ్యక్షుడిగా మార్త రమేశ్​, ప్రధాన కార్యదర్శిగా నందకుమార్​ ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు గతంలో ఇచ్చినవిధంగా 43 శాతం కంటే మెరుగైన ఫిట్​మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్ , టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్  డిమాండ్​ చేశారు. పీఆర్సీ రిపోర్ట్ లేట్ చేయటం వల్ల ఉద్యోగులు, టీచర్లు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆదివారం బేగంపేట టూరిజం ప్లాజాలో విఠల్ అధ్యక్షతన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడిగా మార్త  రమేశ్​, ప్రధాన కార్యదర్శిగా నందకుమార్ ను  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉద్యోగుల సమస్యలపై 19 తీర్మానాలు చేశారు.  పీఆర్సీని 2018 జులై 1 నుంచి అమలయ్యేలా ప్రకటించాలని, హెచ్ ఆర్ ఏ ను అన్ని శ్లాబులలో రెండు శాతం పెంచాలని సంఘం నేతలు డిమాండ్​ చేశారు. గ్రాట్యుటీ రూ. 25 లక్షలకు పెంచటంతోపాటు హెడ్ క్వార్టర్స్ లో ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఎలాంటి కండిషన్స్ లేకుండా హెల్త్ కార్డులు అమలు చేయాలని,  సీపీఎస్ ను రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు.