- ఓ సైనికుడి భూ పోరాటం
- అయిన దొరకని పరిష్కారం
- కోర్టులో తేల్చుకోవాలన్న కలెక్టర్
- ఆ సర్వేనంబర్‌లో 200 మందికి పైగా బాధితులు
- పరిష్కారం చూపలేకపోతున్న ఆఫీసర్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు :
‘ఆయనో సైనికుడు.. పేరు తోట శంకర్..ఊరు ములుగు జిల్లా అబ్బాపూర్..ఈయన చాలా ఏండ్లు చైనా బోర్డర్‌లో డ్యూటీ చేశాడు.. ఇప్పుడు ఢిల్లీలోని హోమ్ శాఖలో పని చేస్తున్నాడు. తొమ్మిదేండ్ల కింద భూపాలపల్లిలో 300 గజాల స్థలం కొన్నాడు. ఇప్పుడీ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇది తెలిసి న్యాయం చేయాలని ఆయన ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో వచ్చారు. భూపాలపల్లిలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తాను కొన్న స్థలంలో ఇల్లు కట్టుకుందామని పోతే హద్దురాళ్లు తొలగించారని తనకు న్యాయం చేయాలని అడిగితే కలెక్టర్మాత్రం కోర్టులో చూసుకోవాలని చెప్పి పంపించారు. దీంతో అతడు తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. బాధితుల్లో శంకర్మాత్రమే కాకుండా సుమారు 200 మంది వరకు ఉన్నారు. ఈ భూమి విలువ సుమారు రూ.30 కోట్లు కావడంతో రికార్డుల్లో లోపాల ఆధారంగా కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయినా ఆఫీసర్లు స్పందించడం లేదు.
రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కూడా..
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మాంటిస్సోరి వెనుకాల ఉన్న 148, 145/ఇ సర్వే నెంబర్‌లో 6 ఎకరాల వ్యవసాయ భూమిని 2002లో పలువురు కలిసి కొన్నారు. ఇందులో కొంతకాలం వ్యవసాయం కూడా చేశారు. తర్వాత ఇండ్ల స్థలాలుగా అమ్ముకోవడానికి తహసీల్దార్ ఆఫీసులో నాలా ఫీజు చెల్లించారు. నాన్ లే అవుట్ ప్లాట్స్‌గా కన్వర్ట్ చేసి హద్దులు ఏర్పాటు చేసి 2014 లోనే సుమారు 200 మందికి ఇండ్ల స్థలాలుగా చేసి విక్రయించారు. సైనికుడు శంకర్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వందలాది మంది చిన్నాచితకా ఉద్యోగులు, సామాన్య కుటుంబాలకు చెందిన వాళ్లు ఈ ప్లాట్లను కొన్నారు. రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇండ్లు కట్టుకుందామని పోతే ఈ భూమి తమదేనంటూ కొందరు అడ్డుకుంటున్నారు. హద్దురాళ్లు పీకేశారు. వీరికి పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
బై నంబర్లతో కబ్జాకు యత్నం
సుమారు రూ.30 కోట్ల విలువ చేసే ఈ భూములపై కన్నేసిన ఓ వ్యక్తి 145/ఆ సర్వే నెంబర్‌లో 2 ఎకరాలు, 145/ఓ సర్వే నెంబర్‌లో 4 ఎకరాల భూమిని తెల్లకాగితాలపై కొన్నట్టు అప్పటి భూపాలపల్లి తహసీల్దార్ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. ఆఫీసర్లు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే ధరణి వెబ్‌సైట్‌లో పట్టాదారు పాస్‌బుక్ జారీ చేశారు. ఈ పాస్‌బుక్ ఆధారంగానే సదరు వ్యక్తి ఇదివరకే ఇండ్ల స్థలాలుగా అమ్మిన 148, 145/ఇ సర్వే నంబర్లోని భూమిని సొంతం చేసుకోవాలని ప్లాన్వేశాడు. ఇతడికి మాజీ మావోయిస్టు ఒకరు సహకరిస్తున్నారని సమాచారం. దీంతో బై నంబర్ల ఆధారంగా 2014లోనే సైనికుడైన శంకర్, మరికొందరు కొన్న ఇండ్ల స్థలాల ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. తమ వ్యవసాయ భూమి ఇదేనని చెప్తూ బెదిరిస్తున్నారు. పట్టాదారు పాస్‌బుక్ ఆధారంగా బై నంబర్లతో కూడిన భూమినే చూపిస్తూ ఆఫీసర్ల సహకారంతో విలువైన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు.
కోర్టులో కేసుంది...
ఈ విషయమై కలెక్టర్ భవేశ్ మిశ్రాను వివరణ కోరగా శంకర్ ఇచ్చిన కంప్లయింట్‌కు సంబంధించిన భూమి విషయంలో కోర్టులో కేసుందన్నారు. అందుకే తాను కోర్టుకు వెళ్లాలని చెప్పానన్నారు. శంకర్ ఇంటి స్థలం కోర్టు కేసులో ఉన్న స్థలం వేర్వేరు సర్వే నంబర్లకు చెందినవని, అలాంటప్పుడు భూమి సర్వే చేస్తే సరిపోతుందిగా అని ‘వీ6 వెలుగు’ ప్రశ్నిస్తే శంకర్ ల్యాండ్ సర్వే కోసం మీ సేవాలో దరఖాస్తు చేసుకుంటే చేస్తామని వివరణ ఇచ్చారు.
సర్వే చేస్తే నిజం బయటకు...
శంకర్‌తో పాటు వందలాది మంది ప్లాట్లు కొన్న భూమి.. కబ్జాదారులు చూపిస్తున్న డాక్యుమెంట్లలో ఉన్న భూమి ఒక్కటి కాదని బాధితులు చెబుతున్నారు. 148, 145సర్వే నంబర్లో ఉన్న వేర్వేరు బై నెంబర్లు ఉన్న భూమి అని అంటున్నారు. తమ స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఫేక్ పేపర్లను అడ్డుపెట్టుకొని ఇండ్లు కట్టుకోనియకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. తమ భూములు నాలా కన్వర్షన్ చేసిన ఇండ్ల స్థలాలయితే వాళ్లు చూపించే భూమి వ్యవసాయ భూమి అని అన్నారు. తహసీల్దార్, ఆర్డీవోతో సహా ఆఫీసర్లందరికీ ఈ విషయం తెలుసని, ఫేక్ డాక్యుమెంట్లతో వ్యవసాయం చేయకుండానే రైతుబంధు పథకంలో డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని శంకర్ ‘వీ6 వెలుగు’కు చెప్పారు. డాక్యుమెంట్ల ఆధారంగా సదరు వ్యక్తికి భూమి అమ్మింది ఎవరు? ఏ సర్వే నంబర్లో భూమిని అమ్మారు? తమకు ఇండ్ల స్థలాలు అమ్మింది ఎవరు? ఏ సర్వే నంబర్లోని భూమిని అమ్మారు? భూములకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని రెవెన్యూ ఆఫీసర్లు పరిశీలించి ల్యాండ్ సర్వే చేసి హద్దులు పెడితే సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు. కలెక్టర్ ఆదేశిస్తే కేవలం తహసీల్దార్ చేసే పనిని కోర్టులో చూసుకోవాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సరిహద్దులో ఉద్యోగం చేసుకునే తాను కోర్టుల చుట్టూ ఎలా తిరగగలనని ప్రశ్నించినా ఆఫీసర్లు పట్టించుకోవట్లేదని శంకర్ ఆరోపించారు.