కాళ్లు మొక్కుతా..న్యాయం చేయండ్రి

కాళ్లు మొక్కుతా..న్యాయం చేయండ్రి

యాదాద్రి, వెలుగు : తన భూమి తనకు ఇప్పించాలని యాదాద్రి జిల్లా అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాసరెడ్డి కాళ్లు మొక్కాడో వృద్ధ రైతు. తహసీల్దార్ మోసం చేసి తన భూమిని తమ్ముడి పేరుపై మార్చి పాస్​బుక్ ఇచ్చారని కంప్లయింట్​ చేశాడు. జిల్లాలోని మోటకొండూరు మండలం ముత్తిరెడ్డి గూడానికి చెందిన ఏకు చిన్న లక్ష్మారెడ్డి కథనం ప్రకారం...లక్ష్మారెడ్డికి సర్వే నంబర్​817లో 2.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఎకరం భూమిని లక్ష్మారెడ్డి తమ్ముడు సంజీవరెడ్డి ఆక్రమించుకొని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకున్నాడు. ఈ భూమి విషయంలో లక్ష్మారెడ్డి హైకోర్టుకు వెళ్లగా కేసు కొనసాగుతోంది. ఇదే క్రమంలో లక్ష్మారెడ్డి పేరుపై ఉన్న 1.10 ఎకరాల్లో ఎకరం భూమిని సంజీవరెడ్డి పేరుపై మోటకొండూరు తహసీల్దార్​ 817 /15/ 2 గా నమోదు చేసి పట్టాదారు పాస్​బుక్​ఇచ్చాడు. ఈ విషయం ధరణి రికార్డుల ద్వారా తెలుసుకుని తహసీల్దార్​కు కంప్లయింట్ ​చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోకపోవడంతో గురువారం అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాసరెడ్డిని కలిశాడు. ఫిర్యాదు కాపీని అడిషనల్​ కలెక్టర్​ చదువుతుండగా ఆయన కాళ్లు మొక్కాడు. దీంతో వారించిన అడిషనల్ ​కలెక్టర్​ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వయస్సులో తిరగలేకపోతున్నానని, తొందరగా న్యాయం చేయాలని కోరాడు.