న్యూఢిల్లీ: నిర్భయ దోషులను ఉరి తీయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను ఈ నెల 11(మంగళవారం) విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఆర్. భానుమతి ఆధ్వర్యంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ శుక్రవారం పిటిషన్‌ను విచారించింది. “ దేశ సహనాన్ని పరీక్షించింది చాలు.. ఇక వారిని ఉరి తీసేందుకు అనుమతివ్వండి” అని కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. పవన్‌గుప్తా ఐదు సంవత్సరాలుగా క్షమాభిక్ష పిటిషన్ వేయలేదని ఆరోపించారు. దీనిపై దోషులకు నోటీసులు జారీ చేయాలని ఆయన కోరగా కోర్టు దానికి నిరాకరించింది.
మరోవైపు, ఫ్రెష్ డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ తీహార్ అధికారులు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టేసింది. దోషులకు హైకోర్టు వారం రోజుల గడువు ఇచ్చినప్పుడు డెత్ వారెంట్ జారీ చేయలేమని అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా స్పష్టం చేశారు. నలుగురు దోషుల్లో ముగ్గురి మెర్సీ పిటిషన్లను రాష్ట్రపతి రిజక్ట్ చేశారని, న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు వారం గడువు ఇచ్చిన నేపథ్యంలో ఫ్రెస్ డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ తీహార్ అధికారులు కోర్టులో అప్లికేషన్ వేశారు.
