రష్యా యుద్ధాన్ని ఆపేలా ఒత్తిడి తెచ్చేందుకే ఇండియాపై సుంకాలు: జేడీ వాన్స్

రష్యా యుద్ధాన్ని ఆపేలా ఒత్తిడి తెచ్చేందుకే ఇండియాపై సుంకాలు: జేడీ వాన్స్

వాషింగ్టన్: ఇండియాపై అమెరికా విధించిన 50 శాతం అదనపు సుంకాలపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు. ఉక్రెయిన్‎తో యుద్ధాన్ని ఆపేలా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే ఇండియాపై అదనపు సుంకాలు విధించినట్లు వివరణ ఇచ్చారు జేడీ వాన్స్. ఎన్బీసీ న్యూస్ మీట్ ది ప్రెస్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియాపై సుంకాల విధింపుపై వాన్స్ స్పందించారు. 

రష్యా తమ చమురు అమ్ముకుని ఆర్థికంగా బలపడకుండా అడ్డుకునే వ్యూహంలో భాగంగానే భారత్‎పై ట్రంప్ అదనపు సుంకాలు విధించారని క్లారిటీ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న అతిపెద్ద దేశాల్లో భారత్ ఒకటని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించగలదని ధీమా వ్యక్తం చేశారు వాన్స్. 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఇటీవల ఇరుదేశాలతో ట్రంప్ చర్చలు జరిపారని.. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పారు. రష్యా యుద్ధం ఆపేస్తే ఆ దేశంపై ఆర్ధిక ఆంక్షలను ఎత్తేస్తామని ట్రంప్ స్పష్టంగా చెప్పారని, కానీ రష్యా యుద్ధం ఆపకపోతే వారు ఒంటరిగానే మిగిలిపోతారని హెచ్చరించారు. మూడేళ్లుగా సాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇందులో భాగంగానే రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధం ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దని భారత్‎ను హెచ్చరించాడు ట్రంప్. కానీ ట్రంప్ మాటలు లెక్కచేయని భారత్ దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. ఇండియాపై 50 శాతం అదనపు సుంకాలు విధించాడు.