
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన స్పోర్ట్స్ పాలసీని శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరగనున్న తొలి ఎడిషన్ ‘తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్’లో ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి, శాట్జ్ చైర్మన్ శివసేనా రెడ్డి తో కలిసి ప్రారంభిస్తారు. దేశ క్రీడా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించింది.
స్పోర్ట్స్ కాంక్లేవ్‌లో ఈ పాలసీపై చర్చిస్తారు. ఒలింపియన్లు పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, అభినవ్ బింద్రా, అంజు బాబీ జార్జ్ తదితరులు కీలక చర్చల్లో, ప్యానెల్ డిస్కషన్స్‌లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిఫా వంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు, ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో పాటు స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్‌తో కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది.