నేడు దవాఖానాలు బంద్..

నేడు దవాఖానాలు బంద్..
  • మెడికల్​ కమిషన్​ బిల్లుకు వ్యతిరేకంగా డాక్టర్ల నిరసన
  • దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు ఐఎంఏ పిలుపు
  • గవర్నమెంట్, ప్రైవేటు హాస్పిటళ్లన్నీ బంద్
  • నేడు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు అమలు
  • ఎమర్జెన్సీ సేవలకు మాత్రం మినహాయింపు

హైదరాబాద్, వెలుగునేషనల్ మెడికల్​కమిషన్ ​బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హాస్పిటళ్ల బంద్​లో భాగంగా రాష్ట్రంలోనూ బుధవారం వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఎమర్జెన్సీ సేవలు మినహా అన్నింటినీ  బుధవారం ఉదయం  24 గంటల పాటు నిలిపివేస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్ఏ) తెలంగాణ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును ఆమోదించటాన్ని నిరసిస్తూ ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ బిల్లు పూర్తిగా ప్రజలకు నష్టం కలిగించేలా ఉందన్నారు. దీనిని వెంటనే కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ రంగానికి మేలు చేసేలా బిల్లును రూపొందించారని, ఇది సామాన్య ప్రజలకు వైద్యాన్ని మరింత భారం చేయటమేనన్నారు. బిల్లులోని కొన్ని సెక్షన్లు వైద్య రంగాన్ని పూర్తిగా నీరుగార్చేలా ఉన్నాయన్నారు.

4 అంశాలపై తీవ్ర అభ్యంతరం

ఎన్ఎంసీ బిల్లులో ప్రధానంగా నాలుగు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఎగ్జిట్ ఎగ్జామ్, బ్రిడ్జి కోర్సులు, ప్రైవేట్ కాలేజీలకు ఫీజులు పెంచుకునే అవకాశం ఇవ్వడం, ఎన్ఎంసీ కమిటీలో వైద్యులు లేకపోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కేంద్రం నిర్ణయం కారణంగా సాధారణ, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందన్నారు. బ్రిడ్జి కోర్సులో భాగంగా ఆయూష్ విద్యార్థులకు అల్లోపతి వైద్యం చేసే అవకాశం ఇస్తే వైద్య ప్రమాణాలు
పడిపోతాయన్నారు.

కేంద్రం దిగిరాకుంటే.. వరుసగా ఆందోళనలు

ఎన్ఎంసీ బిల్లుకు నిరసనగా చేపట్టిన ఆందోళనల్లో ఇది మొదటి అడుగు మాత్రమేనని ఐఎమ్ఏ తెలిపింది. తమ నిరసనకు కేంద్రం దిగిరాకుంటే వరుసగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేసింది. అవసరమైతే వారం రోజుల పాటు వైద్య సేవలు పూర్తిగా నిలిపివేస్తామన్నారు. అటు జూనియర్ వైద్యులు వారం రోజులుగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆందోళనలో భాగంగా ఎలక్టివ్ విధులను బహిష్కరిస్తున్నట్లు జూడాలు డీఎంఈ రమేష్ రెడ్డికి నోటీసులు కూడా ఇచ్చారు.