ప్రాక్టీస్ మ్యాచ్ లతోనే ముగిసిన రేస్.. ఆదివారమే అన్ని పోటీలు

ప్రాక్టీస్ మ్యాచ్ లతోనే ముగిసిన రేస్.. ఆదివారమే అన్ని పోటీలు

హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్స్ లో ఇవాళ ప్రాక్టీస్ మ్యాచ్ లతో రేస్ ముగిసింది. మరోసారి రేసింగ్ నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మొయిన్ క్వాలిఫయింగ్ రేసులు, ఒక స్ప్రింట్ రేస్ జరగలేదు. దీంతో రేపే అన్ని పోటీలు నిర్వహించే యోచనలో నిర్వాహకులు ఉన్నారు. దీంతో రేపు ఫైనల్ రేస్ జరగనుంది. 

గతంలో మాదిరిగానే మరోసారి రేస్ నిర్వహణలో ఆలస్యం జరిగింది. సాంకేతిక కారణాలతో ఇవాళ చాలా ఆలస్యంగా స్పోర్ట్స్ కార్లు ట్రాక్ ఎక్కాయి. రెండు కార్లు రేస్ మధ్యలో ఆగడంతో రెండు సార్లు రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చారు. మరోవైపు రేస్ చూసేందుకు గతంలో కంటే ఇవాళ తక్కువ సంఖ్యలో వీక్షకులు హాజరయ్యారు. రేపు జరగనున్న ఇండియన్ రేసింగ్ ఫైనల్ పై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ రేస్ లో ఆరు టీమ్స్, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్ పాల్గొంటున్నారు. 250 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ తో స్పోర్ట్స్ కార్లు దూసుకుపోనున్నాయి. ఇండియన్ రేసింగ్ లీగ్ తో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. NTR మార్గ్, నెక్లెస్ రోడ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద రాకపోకలు నిలిపివేశారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ థియేటర్ల వైపు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ మళ్లీంపుతో మరోసారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుట్టూ తిరిగి వెళ్లడం కష్టమవుతోందంటున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ తో రోడ్లపై గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి.