నేడు వరల్డ్‌ ఎగ్‌ డే: గుడ్డు ఈజ్​ గుడ్

నేడు వరల్డ్‌ ఎగ్‌ డే: గుడ్డు ఈజ్​ గుడ్

పోషణలో తల్లిపాల తర్వాత ‘గుడ్డు’కి రెండో స్థానం ఇవ్వొచ్చు. అనేక విటమిన్లు, మినిరల్స్‌‌తో నిండిన సూపర్ ఫుడ్డు ఎగ్‌‌.  దీనిలో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ, ఫొల్లేట్లు పుష్కలంగా ఉంటాయి.   ప్రతి గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ల, 78 కాలరీల శక్తి ఉంటుంది.  వారానికి మూడుసార్లు ఉదయం రెండుగుడ్లను బ్రేక్‌‌ఫాస్ట్‌‌గా తీసుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు తగ్గుతాయి.  కంటికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.  అయితే ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో రిపోర్టు ప్రకారం, 80 శాతం ఇండియన్స్‌‌ ఆహారంలో ప్రోటీన్ల లోపం ఉంది. మనిషి బరువును బట్టి, కిలో బరువుకు, రోజుకు ఒక గ్రాము ప్రోటీన్‌‌ను ఆహారంలో తీసుకోవాలి.  మన దేశంలో ఆహార ఉత్పత్తి ఎంత పెరిగినప్పటికీ,  పోషకాలు మాత్రం అందరికీ తగినంగా  లభించటం లేదు. ఈ పరిస్థితి గ్రామాల్లోని పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో ఎక్కువగా కనిపిస్తున్నది. గ్రామీణులకు పోషక విలువల గురించి సరైన అవగాహన లేకపోవడంతో వీటి వాడకం తక్కువగా ఉంది. ప్రతి వ్యక్తి సంవత్సరానికి కనీసం 180 గుడ్లు తినాలని  నేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్​ న్యూట్రిషన్‌‌ సూచించింది.  మన దేశంలో సగటు వినియోగం 70 గుడ్లు మాత్రమే.  మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్ల వరకు  ఉంది. మన వద్ద అది 70 కంటే మించడం లేదు. గుడ్ల వినియోగంలో, ప్రపంచంలో మన ర్యాంకు 114 మాత్రమే. ఈ విషయం గుర్తించిన మన ప్రభుత్వాలు విద్యార్థులకు, గర్భిణులకు, మధ్యాహ్న  భోజనం లాంటి పథకాల్లో గుడ్లు అందించి,  పోషకాహార లోపం తలెత్తకుండా చూస్తున్నాయి. అంతర్జాతీయ ఎగ్ కమిషన్ కూడా గుడ్లలో  పోషకాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.